కమలంలో కల్లోలం..కాంగ్రెస్‌కు ప్లస్.!

కొన్ని నెలల ముందు వరకు తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బి‌జే‌పినే అనే పరిస్తితి. కానీ ఇప్పుడు టోటల్ సీన్ రివర్స్ అయింది. బి‌జే‌పి మళ్ళీ యథావిధిగా 2018 ఎన్నికల్లో ఎలాంటి బలం ఉందో..అంతే బలానికి పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఎన్నికల్లో బి‌జే‌పికి ఒక సీటు రాగా, 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవడం, బండి సంజయ్ అధ్యక్షుడుగా దూకుడుగా పనిచేయడం, రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టడం..అదే సమయంలో కాంగ్రెస్ లో కుమ్ములాటలతో వెనుకబడటంతో బి‌జే‌పికి అడ్వాంటేజ్ అయింది.

కానీ ఎప్పుడైతే అధ్యక్ష పదవిని మార్చారో అప్పటినుంచి సీన్ మారింది. అటు కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో తెలంగాణలో అడ్వాంటేజ్ అయింది. ఇక నిదానంగా బి‌జే‌పి రేసులో నుంచి తప్పుకోగా, కాంగ్రెస్ దూసుకొచ్చింది. ఇక బి‌జే‌పిలో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీనియర్ నేతలంతా తలో దిక్కు అన్నట్లు అయ్యారు. ఎవరి మధ్య సమన్వయం లేదు. పైగా పార్టీలో కొందరు నేతలు చేరాలని చూస్తే..పార్టీలో ఉండే సీనియర్లు కొందరు అడ్డంపడి చేరనివ్వలేదు.

ఇటీవల  మాజీ మంత్రి కృష్ణాయాదవ్‌, చీకోటి ప్రవీణ్‌ భారీగా తమ అనుచరులతో పార్టీలో చేరాలని వస్తే..పార్టీలో చేర్చుకోకుండా అవమానించారు. ఇదే సమయంలో కొందరు నేతల సస్పెషన్ కూడా పార్టీకి నష్టం తెచ్చింది.  జిట్టా బాలకృష్ణారెడ్డి, పార్టీ ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన యెన్నెం శ్రీనివాసరెడ్డి సస్పెన్షన్‌ వ్యవహారం కూడా పార్టీ కేడర్‌లో చర్చనీయాంశమైంది. వేటు తర్వాత వీరు బీజేపీ నాయకత్వంపై విమర్శలు చేశారు. అటు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వారు పార్టీకి దూరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. మొత్తానికి తెలంగాణ బి‌జే‌పిలో కల్లోలం కొనసాగుతుండగా, కాంగ్రెస్‌కు అడ్వాంటేజ్ అవుతుంది.