నారా లోకేశ్ ట్వీట్… క్యాడర్‌లో డైలమా…!

ఓ వైపు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారు. అసలు అవినీతి జరగలేదని పైకి చెబుతున్నప్పటికీ… వాస్తవ పరిస్థితి మాత్రం వేరుగా ఉందనేది పార్టీలో నేతల గుసగుసలు. మేము నిజాయతీ అని పైకి చెబుతున్నప్పటికీ… కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతుండటంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తెలుగుదేశం పార్టీలో సగటు కార్యకర్త పరిస్థితి. ఈ పరిస్థితుల్లో టీడీపీ యువనేత పెట్టిన ఓ ట్వీట్.. అటు పార్టీలో ఇటు క్యాడర్‌లో కూడా కలకలం రేపుతోంది. ఇంకా చెప్పాలంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలేమిటనే మాట కూడా బలంగా వినిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందనే ఆరోపణలతో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ముందు ఓ వారం రోజుల పాటు రాజమండ్రి జైలు దగ్గరే బస చేసిన లోకేశ్… ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టుపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాజమండ్రి జైలులో పరిస్థితులపై లోకేశ్ ఓ ట్వీట్ వేశారు. జైలులోనే చంద్రబాబును హత్య చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే అది కూడా కేవలం దోమల ద్వారా హత్య చేస్తారేమో అనేలా లోకేశ్ వ్యాఖ్యానించారు. డెంగ్యూ కారణంగా జైలులో ఓ రిమాండ్ ఖైదీ మృతి చెందాడని… చంద్రబాబును కూడా అలా దోమలతో హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని లోకేశ్ అనుమానం వ్యక్తం చేశారు.

అయితే మృతి చెందిన రిమాండ్ ఖైదీకీ ఈనెల 7వ తేదీ నుంచే డెంగ్యూ లక్షణాలున్నాయని… ప్లేట్ లెట్స్ పడిపోవడంతో… అతనిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు జైల్ సూపరింటెండెంట్. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. అదే సమయంలో జైలులో అన్ని సౌకర్యాలున్నాయని కూడా తెలిపారు. అయితే అధినేతను చంపుతారేమో అని సొంత కొడుకే అనుమానం వ్యక్తం చేయడం… అది కూడా దోమల వల్ల ఏమో అనే అనుమానం వ్యక్తం చేయడం.. ఇప్పుడు కిందిస్థాయి కేడర్ ను భయానికి గురి చేస్తోంది. న్యాయపోరాటం చేసి బయటకు తీసుకురావాల్సిన నేత.. ఇలా వ్యాఖ్యానించడం ఏమిటని మాట్లాడుకుంటున్నారు.