లోకేశ్ ఢిల్లీలోనే ఎందుకున్నట్లు… వస్తే ఏమవుతుంది….!?

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఎక్కడున్నారు…. ఆయన కూడా అరెస్ట్ అవుతారా… లోకేశ్ పారిపోయారా… ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న మాట ఇదే. ఓ వైపు స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో భారీ అవినీతి జరిగిదంటూ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు రెండు రోజుల పాటు సుధీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆ తర్వాత నుంచి పరిస్థితులు టీడీపీకి వ్యతిరేకంగా మారిపోయాయనే చెప్పాలి. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబును సిద్ధహస్తునిగా పొలిటికల్ సర్కిల్‌లో పేరు. అలాంటి చంద్రబాబు ప్రస్తుతం దాదాపు 14 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి. అటు న్యాయస్థానాల్లో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని… ఆయనకు హైకోర్టులో ఊరట వస్తుందని అంతా భావించారు. కానీ క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో టీడీపీ నేతలకు దిమ్మ తిరిగినట్లైంది.

ఇదే సమయంలో ఫైబర్ నెట్ కేసులో మాజీ మంత్రి నారా లోకేశ్ కూడా అరెస్ట్ అవుతాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే విషయాన్ని ఇప్పటికే వైసీపీ నేతలు కూడా వెల్లడించారు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చిన లోకేశ్… ఓ వారం రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దే ఏర్పాటు చేసిన క్యాంపులో బస చేశారు. నేతలతో మంతనాలు జరిపారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణ ములాఖత్ తర్వాత టీడీపీ – జనసేన పొత్తు ఖరారైంది. అదే రోజు సాయంత్రం నారా లోకేశ్ ఢిల్లీ వెళ్లారు. ముందుగా జాతీయ స్థాయిలో చంద్రబాబు అరెస్టుపై లోకేశ్ పోరాటం చేస్తారని అంతా భావించారు. ఇక జాతీయ మీడియాకు వరుస ఇంటర్వ్యూల తర్వాత లోకేశ్ సైలెంట్ అయ్యారు. కేవలం పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో మాత్రమే మంతనాలు జరుపుతున్నారు తప్ప… బయటకు మాత్రం రావడం లేదు. దీంతో లోకేశ్ అరెస్టుకు రంగం సిద్ధమైందని… అందుకే లోకేశ్ ఢిల్లీ వదిలి ఏపీకి రావడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్, ఢిల్లీలో ఉన్నంత వరకు లోకేశ్ సేఫ్‌గా ఉంటారని… ఏపీకి వచ్చిన వెంటనే లోకేశ్‌ను సీఐడీ అధికారులు అరెస్ట్ చేస్తారని ఇప్పుడు సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే హస్తిన నుంచి కాలు బయట పెట్టకుండా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.