కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్..? త్వరలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన…?

తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ త్వరలో కేంద్ర పాలిత కేంద్రం కానుందా..? హైదరాబాద్‌ను యూటీ (యూనియన్ టెరిటరీ) గా చేసే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తోందా..? హైదారబాద్ యూటీకి సంబంధించి త్వరలో కీలక ప్రకటన రానుందా..? అంటే అవుననే అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం గల్లీ నుంచి ఢిల్లీ వరకు సోషల్ మీడియాలో జరుగుతున్న విస్తృతమైన ప్రచారం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.

హైదరాబాద్‌ను యూటీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. దీనికి సంబంధించి వివిధ శాఖల అధికారులు, రక్షణ విభాగాల ప్రతినిధులతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రహస్యంగా చర్చలు జరుపుతున్నారని వస్తున్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్టుగా.. తెలంగాణపై అత్యధిక ఫోకస్ పెట్టిన బీజేపీ పెద్దలు.. హైదరాబాద్ విషయంలోనూ సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రానికే ఆయువుపట్టులా ఉండే హైదరాబాద్ నగరం.. తమ ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తెచ్చుకోవటం ద్వారా.. “ఒక్క దెబ్బకు అనేక పిట్టలు” అన్న వ్యూహాన్ని కమలనాథులు అమలు చేయబోతున్నారనే టాక్ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి వస్తున్న లీకులను.. హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ప్రచారం.. రాజకీయ కాక రాజేస్తోంది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలోనే హైదరాబాద్‌ను యూటీ చేయాలని సీమాంధ్ర నాయకులు డిమాండ్ చేశారు. అయితే.. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోని ఆనాటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా చేసింది. ఈ గడువు మరో ఏడాదిలో అంటే.. 2024 జూన్‌తో ముగిసి పోనుంది. సరిగ్గా ఈ సమయంలోనే హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీగా ప్రకటిస్తారు అనే ప్రచారం తెరపైకి రావటం ప్రాధాన్యం సంతరించుకుంది. వాస్తవంగా.. హైదరాబాద్ ను యూనియన్ టెరిటరీగా ప్రకటిస్తే.. ప్రధాని మోడీ సర్కార్‌కు, భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రయోజనం చేకూర్చే అంశంగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే ఏపీలో ఉనికి కోసం పోరాడుతున్న బీజేపీ.. తెలంగాణలో మాత్రం ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే.. HMDA పరిధిలోని మొత్తం భాగ్యనగరం అంతా కేంద్రం అజమాయిషీలోకి వెళ్ళిపోతుంది. దీంతో.. ఇక్కడ అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలా భావించే భాగ్యనగారాన్ని కేంద్రంగా చేసుకునే రాజకీయ పార్టీలన్నీ మనుగడ సాగిస్తున్నాయి. అలాగే తెలంగాణ ఆదాయంలో సింహభాగం హైదరాబాద్ నుంచే వస్తోంది. ఈ ఆదాయాన్ని ఆధారంగా చేసుకునే తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి దళిత బంధు, రైతు బంధు అంటూ అనేక పిల్లి మొగ్గలు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కనుక హైదరాబాద్‌ను యూటీ చేస్తే.. హైదరాబాద్ ఆదాయం కేంద్ర ఖజానాకు జమ కానుంది. ఇదే కనుక జరిగితే.. కేసీఆర్ కుప్పి గంతులకు శాశ్వతంగా చెక్ పెట్టినట్టు అవుతుందని.. బీజేపీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి.

ఇక.. హైదరాబాద్ యూటీ అంటే ఇతర ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చినా.. హైదరాబాదీయులు మాత్రం స్వాగతిస్తారనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే.. చాలా వస్తువులపై పన్నులు తగ్గటం, జీవన ప్రమాణాలు పెరగటం, దేశ రాజధాని ఢిల్లీ తరహా అభివృద్ధి సాధ్యమవ్వటం వంటి అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయని అంటున్నారు. అంతే కాదు రక్షణ పరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కావటంతో.. హైదరాబాద్ ను యూటీ చేయటం అనే ప్రతిపాదన ఏనాటి నుంచో ఉంది. దేశ రక్షణ ప్రయోజనాల కోసమే హైదరాబాద్‌ను యూటీ చేస్తున్నామని కేంద్రం చెబితే అభ్యంతరం వ్యక్తం చేసే వారుండరు. ఎందుకంటే ఇక్కడ అనేక రక్షణ సంస్థలు ఉన్నాయి. రెండు మిలటరీ కంటోన్మెంట్‌లు, ఆయుధ తయారీ కేంద్రాలు అనేకం ఉన్నాయి. కాబట్టి.. హైదరాబాద్ యూటీపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అంగీకరించటం తప్ప ఇతర పార్టీలకు మరో ప్రత్యామ్నాయం ఉండదని రాజకీయ పరిశీలకుల అభిప్రాయంగా ఉంది.

అన్నింటికన్నా మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఎంఐఎం ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం మరింత సెన్సిటివ్‌గా మారింది. పాతబస్తీని అడ్డాగా చేసుకుని ఆ పార్టీ మతపరంగా సమాంతర వ్యవస్థ నడుపుతోంది. ఒకవేళ హైదరాబాద్‌ను యూటీ చేస్తే ఎంఐఎం కార్యకలాపాలకు పూర్తిగా బ్రేక్ పడుతుంది. కేంద్రం ప్రత్యక్ష అజమాయిషీ ఉండటంతో.. భాగ్యనగరంలో ఎంఐఎం ఆటలు సాగబోవని అంటున్నారు. ఇలా ఏ విధంగా చూసినా.. హైదరాబాద్‌ యూటీ అంశం అత్యంత కీలకంగా మారనుందనే అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.