టీడీపీ నేతలకు అంత ధీమా ఎందుకు….?

రాబోయే ఎన్నికల్లో గెలుపు మనదే… ఇప్పుడు ఇదే మాట ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కదిపినా చెప్పే మాట. ఇక నేతలైతే… మనదే అధికారం అనేస్తున్నారు కూడా. ఇందుకు ప్రధాన కారణం… పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు కావడమే అంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ స్కామ్‌ కేసులో రూ.371 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఆయనకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. దీని వల్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ నెల 11న రాష్ట్ర బంద్ కూడా పాటించారు. ఆ తర్వాత నుంచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, రిలే నిరాహార దీక్షలంటూ నిరసన తెలియజేస్తున్నారు.

చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల కావాల్సినంత సానుభూతి వచ్చిందంటునేది ఆ పార్టీ నేతల భావన. అందులో భాగంగానే ఏ నేతను కదిపినా సరే.. వచ్చేది మా ప్రభుత్వమే… కాసుకోండి.. ఒక్కొక్కరికి బదులు చెబుతాం అంటూ హెచ్చరిస్తున్నారు కూడా. ఇది కక్ష సాధింపు రాజకీయమని.. కామెంట్లు చేస్తున్న టీడీపీ నేతలు… తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే… బదులు తీర్చుకుంటామంటున్నారు. అంటే… వారు కూడా కక్ష సాధిస్తామనే అర్థం వచ్చేలా వ్యాఖ్యానిస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో ఎలాంటి అవినీతి లేదంటున్నారు కూడా. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేయలేదని.. అలా చేసి ఉంటే ఆయన అరెస్ట్ అయ్యేవారు కాదంటున్నారు కూడా.

చంద్రబాబు అరెస్టు తమ పార్టీకి బూస్టులా పనిచేస్తుందంటున్నారు కొందరు టీడీపీ నేతలు. ఇక ఎన్నికల్లో పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదన్నారు. ఆయనపైన చేసినవన్నీ చిన్న చిన్న ఆరోపణలే అంటున్నారు. బెయిల్ తప్పకుండా వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాదిరిగా ఆయన ఆర్థిక నేరాలు చేయలేదు కాబట్టి తప్పకుండా బయటకు వస్తారు కాబట్టి… ప్రజలకు అన్ని నిజాలు తెలుస్తాయంటున్నారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని… టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.