‘బాస్‌.. గుండు బాస్‌’ అంటూ రజనీకి వెల్కమ్ పలికిన మలేషియా ప్రధాని.. వీడియో వైరల్!

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మలేషియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశ ప్రధానమంత్రి అన్వర్‌ ఇబ్రహీంను రజనీ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధానే ట్విట్టర్ ద్వారా తెలపడం విశేషం. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను ప్రధాని అన్వర్ `ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న రజనీని కలవడం ఆనందంగా ఉంది` అంటూ ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఈ క్రమంలోనే అన్వర్ రజినీకాంత్ కు వినూత్నంగా వెల్కమ్ పలికారు.

శివాజీ సినిమా లో రజనీకాంత్ `బాస్.. గుండు బాస్` అంటూ ప్రత్యేకమైన మేనరిజమ్ తో డైలాగ్ చెబుతారు. అదే మేనరిజమ్ తో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం రజనీకాంత్ కు స్వాగతం పలికారు. ఆపై ఇద్దరు కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మరోవైపు వీరిద్దరి భేటి వెనక కారణం ఏంటి అనే చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రజనీకాంత్ మలేషియా పర్యాటక శాఖకు బ్రాండ్‌ అంబాసిడర్‌ కానున్నారనే ప్రచారం జరగింది. కాగా రజనీకాంత్ రీసెంట్ గా జైలర్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. రజనీకాంత్ తన తదుపరి సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్నారు.