తెలంగాణ ఎన్నికలు వస్తే చాలు..తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకురావడం బిఆర్‌ఎస్ పార్టీకి అలవాటైన పని. ఇప్పటివరకు అదే సెంటిమెంట్ తో బిఆర్‌ఎస్ గెలుస్తూ వస్తుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణ తెచ్చిన పార్టీగా గెలిచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు పెట్టుకుంది. దీన్ని కేసిఆర్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. అదిగో చంద్రబాబు మళ్ళీ తెలంగాణ పై పెత్తనం చెలాయించడానికి వస్తున్నారని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్దిపొందారు.
అయితే ఈ సారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే వ్యవహారం ఉండదని అంతా అనుకున్నారు. కానీ బిఆర్‌ఎస్ నేతలు రాజకీయం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. తాజాగా కేటిఆర్ తెలంగాణలో కాంగ్రెస్, బిజేపిలని నడిపించేది ఆంధ్రా నాయకులు అన్నట్లు చెప్పుకొచ్చారు. అయితే మొన్నటివరకు రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నారని కామెంట్లు చేసేవారు. ఇప్పుడు బాబు అరెస్ట్ అయి ఉన్నారు. పైగా ఆయన్ని ఈ టైమ్ లో కామెంట్ చేస్తే..తెలంగాణలో ఉండే కొద్ది టిడిపి ఓట్లు తమకు పడవని అనుకున్నారేమో..అందుకే బాబు ఊసు తీయలేదు.
కానీ వైఎస్సార్ ఆత్మగా పిలవబడే కేవిపి రామచంద్రారావు పేరు ప్రస్తావించారు. ఏపీకి చెందిన కేవిపి..తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం చేసుకుంటున్నారు. ఇటీవల తనని తెలంగాణ వాడిగా గుర్తించాలని కోరారు. ఈ నేపథ్యంలో రేవంత్ వెనుక కేవిపి ఉన్నారని, కాంగ్రెస్‌ని నడిపించేది ఆయనే అని కేటిఆర్ కామెంట్ చేశారు.
ఇక బిజేపిని సైతం వదలలేదు. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి బిజేపిలో ఉన్న విషయం తెలిసిందే. అది కూడా టి.బిజేపిలో కీలకంగా ఉన్నారు. దీంతో కిషన్ రెడ్డి వెనుక కిరణ్ ఉన్నారని విమర్శించారు. అంటే కాంగ్రెస్, కమలంలో ఆంధ్రా నేతల పెత్తనం ఉందని, మళ్ళీ ఆంధ్రా వాళ్ళ పాలన వద్దని, తెలంగాణ బిడ్డ కేసిఆర్ పాలన మాత్రమే కావాలనే నినాదం అందుకున్నారు. మరి ఈ సెంటిమెంట్ ఎంతమేర వర్కౌట్ అవుతుందో చూడాలి.