ఉత్తరాంధ్రపై ‘ఫ్యాన్’ పట్టు తప్పుతుందా?

గత ఎన్నికల్లో ఆ ప్రాంతం..ఈ ప్రాంతం అనేది లేదు అన్నిచోట్ల వైసీపీ హవా నడిచింది. వైసీపీ వన్‌సైడ్ గా గెలిచింది. మరి ఈ సారి ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందా? వైసీపీ అన్నిచోట్లా సత్తా చాటుతుందా? అంటే అది కాస్త కష్టమనే చెప్పాలి. యథావిధిగా రాయలసీమలో వైసీపీ పై చేయి సాధించవచ్చు. కానీ కోస్తాలో పట్టు సాధించడం సులువు కాదు. ఇక్కడ టి‌డి‌పితో పోటీ తప్పదు. అదే సమయంలో టి‌డి‌పి-జనసేన కలితే కోస్తాలో వైసీపీకి కాస్త గడ్డు పరిస్తితి ఎదురవుతుంది.

మరి విశాఖ రాజధాని అంటున్న ఉత్తరాంధ్రలో వైసీపీకి ఏమైనా కలిసొస్తుందా? అంటే అది పూర్తిగా చెప్పలేని పరిస్తితి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే విశాఖ రాజధాని అని చెప్పినంత మాత్రాన..అది ఇంతవరకు ఆచరణ కాలేదు. మరో రెండు, మూడు నెలల్లో ఆచరణలోకి వచ్చిన ఎన్నికల ముందు స్టంట్ అన్నట్లే ఉంటుంది. పైగా రాజధాని అని అంటూ..విశాఖలో వైసీపీ అనేక అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖలో వైసీపీకి ఆధిక్యం సులువు కాదు. ఇప్పుడు అక్కడ టి‌డి‌పి బలపడుతుంది.

దీంతో విశాఖలో వైసీపీకి టి‌డి‌పి గట్టి పోటీ ఇస్తుంది. పైగా ఇక్కడ జనసేనకు నాలుగైదు సీట్లలో పట్టు ఉంది. టి‌డి‌పితో జనసేన కలిస్తే వైసీపీకి రిస్క్. విజయనగరంలో వైసీపీ ప్రస్తుతం కాస్త లీడ్ లోనే ఉంది. గత ఎన్నికల మాదిరిగా 9కి 9 సీట్లు గెలవడం అసాధ్యం. ఇక శ్రీకాకుళం విషయానికొస్తే..ఇక్కడ సర్వేలు టి‌డి‌పికి అనుకూలంగా ఉన్నాయి. టి‌డి‌పికే ఆధిక్యం ఉందని చెబుతున్నాయి. అంటే ఇక్కడ వైసీపీకి పట్టు అనేది కాస్త కష్టమే. ఓవరాల్ గా చూస్తే ఉత్తరాంధ్రలో వైసీపీ ఆధిక్యం తగ్గుతున్నట్లు కనిపిస్తోంది.