కాంగ్రెస్ టార్గెట్ ఫిక్స్..కలిసొస్తుందా?

తెలంగాణలో ఎన్నికల నగారా మోగించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి ఎన్నికల శంఖారావం పూరించనుంది. పైగా జాతీయ నేతలంతా తెలంగాణకు రానున్నారు. సీడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశాన్ని ఈ నెల 16, 17 తేదీల్లో నిర్వహిస్తున్నారు. అది కూయ హైదరాబాద్ లో ఈ సమావేశాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గేలతో పాటు..కాంగ్రెస్ కీలక నేతలంతా ఈ సమావేశాల్లో పాల్గొనున్నారు. అలాగే 17వ తేదీన బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభలోనే సోనియా తెలంగాణకు సంబంధించి పలు కీలక హామీలు ఇవ్వనున్నారు. ఇప్పటికే రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించిన టీపీసీసీ.. బీసీ, మైనార్టీ, మహిళా డిక్లరేషన్లపైనా కసరత్తు చేస్తోంది. వీటి అన్నిటిని కలిపి ఐదు నుంచి పది హామీలను అధిష్ఠానం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపైనా చార్జిషీట్‌ను విడుదల చేస్తున్నారు.

అయితే సభలో ఈ హామీలు ఇవ్వడమే కాదు..ఈ నెల 18న నేతలంతా 119 నియోజకవర్గాల్లో పర్యటించి..ఇంటింటికి తిరుగుతూ ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. జాతీయ నేతలు ఈ కార్యక్రమాలను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఒకేసారి ప్రారంభించడంతో క్షేత్రస్థాయి ప్రచారం ఒకేసారి మొదలుకానుంది. దీంతో పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావం పూరించనుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే తెలంగాణ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఏఐసీసీ నియమించిన స్ర్కీనింగ్‌ కమిటీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతోపాటు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సభ్యుడిగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు దేశ వ్యాప్తంగా పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభ్యర్థులను నిర్ణయించే అత్యున్నతమైన ఎన్నికల కమిటీలో తెలంగాణకు చెందిన సీనియర్‌ నేత, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చోటు దక్కింది.    ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీనియర్‌ నేతలు అంబికా సోనీ, అధిర్‌ రంజన్‌ చౌదరి లాంటి కీలక నేతలు ఈ కమిటీలో ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ్‌కు మాత్రమే ఆ కమిటీలో చోటు దక్కింది.