35  సీట్లలో ఫిక్స్..కాంగ్రెస్‌కు అవే తలనొప్పి.!

తెలంగాణలో బలమైన అభ్యర్ధులని నిలబెట్టి గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కూడా తీసుకుంది. ఇప్పుడు వాటిని స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుంది. అయితే 119 సీట్లకు దాదాపు 1000 మందిపైనే అప్లికేషన్లు పెట్టుకున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ అభ్యర్ధులని ఫైనల్ చేసే పనిలో పడింది.

ఈ క్రమంలో 35 సీట్లకు ఒక్కో అభ్యర్ధిని ఫైనల్ చేశారట. అంటే సీనియర్ నేతలు ఉన్న చోట..వారికే సీట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. ఆ 35 సీట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలుస్తోంది. కానీ మిగిలిన సీట్లలోనే రచ్చ ఎక్కువ ఉంది. ఆ సీట్లని ఎంపిక చేయడం స్క్రీనింగ్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఒక్కో సీటులో ఇద్దరు, ముగ్గురు నేతలని ఫైనల్ చేసి..అధిష్టానానికి పంపుతారని తెలిసింది. ఇంకా వారే సీట్లని ఫైనలైజ్ చేస్తారని సమాచారం.

ఇప్పటికే చాలామంది సీట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇంకా సీట్లు దక్కని వారు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అటు అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీట్లు దక్కని కొందరు నేతలు కాంగ్రెస్ వైపు రావడానికి రెడీ  అయ్యారు. ఆ దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ లోకి వచ్చే నేతలకు సీట్లు కూడా ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇటు వచ్చే నేతలు ఉన్నా సరే..రేపు కాంగ్రెస్ లో సీట్లు దక్కని వారు జంప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అసలే వెయ్యి మందికి పైగా సీట్లు ఆశించే వారు ఉన్నారు. అలాంటప్పుడు సీటు దక్కని వారు ఏం చేస్తారనేది పెద్ద ప్రశ్న.