అవినీతి బాబు..వైసీపీ చెప్పేది ఇదే.!

మొదట నుంచి అమరావతిలో చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, పోలవరం ప్రాజెక్టులో కమిషన్లు కొట్టేశారని ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బుక్ కూడా వేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక..బాబు అవినీతిని నిరూపించే విషయంలో గాని, అక్రమాలు తేల్చే విషయంలో గాని కాస్త వెనుకబడినట్లే కనిపించింది. ఏదో కొన్ని విషయాలు కేసులు కొనసాగుతున్నాయి తప్ప..ప్రత్యేకంగా బాబుని ఇబ్బంది పెట్టే రీతిలో మాత్రం ముందుకెళ్లలేదు.

కానీ తాజాగా బాబు…అమరావతి నిర్మాణానికి సంబంధించి కొన్ని కాంట్రాక్ట్‌లు చేసిన షాపూర్‌జి పల్లంజి సంస్థ నుంచి 118 కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఐటీ శాఖ..దానికి సంబంధించి బాబుకు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. బాబు తన పి‌ఏ శ్రీనివాస్ ద్వారా ఆ సంస్థ నుంచి బోగస్ సంస్థల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు 118 కోట్లు తీసుకున్నారని, ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై ఇప్పుడు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.  చంద్రబాబు ఇప్పటివరకు తిన్న దానిలో దొరికింది 118 కోట్ల రూపాయలేనని, దొరక్కుండా ఎంత తిన్నాడో బయటికి వస్తుందని, అమరావతి పేరుతో చంద్రబాబు రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని దోచుకున్నాడని పేర్ని నాని విమర్శించారు.

అయితే జగన్‌కు సంబంధించి ప్రతి అంశాన్ని హైలైట్ చేసే యెల్లో మీడియా..ఇప్పుడు ఎందుకు ఈ అంశంపై కథనాలు ఇవ్వడం లేదని, టి‌డి‌పి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీస్తున్నారు. మొత్తానికి బాబు 118 కోట్లు కమిషన్ల రూపంలో తీసుకున్నారనే అంశం రాష్ట్ర స్థాయిలో హాట్ టాపిక్ అయింది. మరి దీనిపై టి‌డి‌పి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.