చంద్రబాబు అరెస్ట్ తర్వాత మారిన సీన్.. గ్రాఫ్ పెరిగిందా….?

తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఆ పార్టీ పట్ల సానుభూతి పెరుగుతూ వస్తుంది. టీడీపీ అధినేతను కక్ష పూరితంగా అరెస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం జైలుకి పంపిందని వివిద వర్గాలకి చెందిన వారు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు చట్టం దాని పని అది చేసుకుపోతుందని…. తప్పు చేసిన వారెవ్వరైనా జైలుకి వెళ్ళాల్సిందేనని స్పష్టంగా తెలియజేస్తున్నా…. జనాల నుంచి రాజకీయ దురుద్దేశ్యంతోనే చంద్రబాబును జైలుకి పంపించారన్న మాట ఎక్కువగా వినిపిస్తొంది. జగన్‌ను అరెస్ట్ సమయంలో టీడీపీ కుట్రలు చేయలేదా అన్న వాదన తెరపైకి వస్తున్నా తాజా పరిస్థితుల నేపధ్యంలో టీడీపీపై సానుభూతి కనిపిస్తొంది. ఐఏఎన్ ఎస్ న్యూస్ ఏజెన్సీ నిర్వహించిన సీ ఓటర్ సర్వేలో వెల్లడైన అంశాలు ఇలా ఉన్నాయి.

రాష్ట్రంలోని వివిద వర్గాలకు చెందిన వారి ద్వారా వివరాలు సేకరించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఎలా చూస్తారు అని సీ ఓటర్ సర్వే సంస్థ అడిగిన ప్రశ్నకి అత్యధిక శాతం మంది కక్ష సాధింపు చర్యేనని పేర్కొన్నారు. ఓవరాల్‌గా చూస్తే 52.1 శాతం మంది ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. పార్టీలకు అతీతంగా బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ వర్గాలు సైతం కక్ష సాధింపు చర్యగా తెలియజేసినట్లుగా వివరాలను వెల్లడయ్యాయి. అలాగే అరెస్ట్ చంద్రబాబుకి సానుభూతి కలిగిస్తుందా అన్న ప్రశ్నకి కూడా 53.1 శాతం మంది అవుననే సమాధానం ఇచ్చారు. అలా సమాధానం ఇచ్చిన వారిలో 73.3 శాతం మంది టీడీపీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేయగా అధికార వైసీపీకి చెందిన 38.6 శాతం మంది అదే విషయాన్ని చెప్పినట్లుగా పేర్కొంది. అదేవిదంగా చంద్రబాబు అరెస్ట్ తో జగన్ అభద్రతా భావంలో ఉన్నారా అంటే ఓవరాల్ 58.1 శాతం మంది నుంచి అవుననే అభిప్రాయం వ్యక్తమైంది. అలా అభిప్రాయం వ్యక్తం చేసిన వారిలో టీడీపీ వర్గాలతో పాటు బిజెపి, కాంగ్రెస్, వైసిపి వారు కూడా ఉన్నారు.

చంద్రబాబు అరెస్ట్ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందా అన్న ప్రశ్నకి కూడా ఓవరాల్ గా 56.1 శాతం మంది బాబుకి లాభమని తమ మనస్సులో మాటను తెలియజేసారు. జగన్ కి నష్టం జరుగుతుందని కూడా స్పష్టం చేసారు. అదే విదంగా జనసేన పార్టీతో పొత్తు టీడీపీకి కలిసివస్తుందా అన్న ప్రశ్నకి ఓవరాల్ గా 60.6 శాతం మంది అవుననే సమాధానం చెప్పారు. టీడీపీతో పాటు బిజెపి, కాంగ్రెస్, వైసిపి వర్గాలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడించినట్లుగా ఆ సంస్థ పేర్కోంది. అలాగే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జగన్ పై మీ అభిప్రాయం అన్న ప్రశ్నకి మాత్రం చెప్పలేము… తెలియదనే ఎక్కువ శాతం మంది తమ నిర్ణయాన్ని వెల్లడించారు.

సీ ఓటర్ సర్వేలో వెల్లడైన విషయాలను పరిశీలిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ప్రతిపక్ష టీడీపీ-జనసేన పార్టీల మద్య పొత్తు కూడా ఖరారైంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధినేత అరెస్ట్ ను ఖండిస్తూ రోడ్లెక్కి నిరసనలు తెలియజేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్దతులలో నిరసనలు తెలియజేస్తున్న నాయకులను, కార్యకర్తలను కూడా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేస్తున్న తీరు కూడా రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష టీడీపీ నాయకులు రోడ్ల మీదకి రాకుండా గృహ నిర్భందాలకి పాల్పడడం, అరెస్ట్ లు చేయడం ద్వారా వారిని నిరసనలు తెలియజేసేందుకు కూడా వీలు లేకుండా కట్టడి చేసిన తీరుపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ తో అయిపోలేదని మరికొందరు టీడీపీ నేతలు కూడా జైలుకి వెళ్లడం ఖాయమని అధికార పార్టీ నాయకులు హెచ్చరిస్తున్న తీరు కలవరం రేకెత్తిస్తుంది.

ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ప్రజలు ఎవరి అభిప్రాయాలను వారు వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలోని కొందరు నాయకులు సైతం ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబునాయుడును అరెస్ట్ చేయడం వల్ల తమ పార్టీకి మైనస్ అవుతుందని పేర్కోంటున్నారు. బయటకి మాత్రం వారు 2024లో మరోసారి వైసీపీ గెలవడం ఖాయమని బల్లలు గుద్ది చెబుతున్నారు. సీట్లు తగ్గినా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రజలకి అభివృద్ది, సంక్షేమ ఫలాలను అందజేస్తూనే ప్రతిపక్షాలకి చెక్ చెప్పేలా రాజకీయాలు సాగిస్తున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ కేసులో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడును సిఐడి అధికారులు అరెస్ట్ చేసి జైలుకి తరలించినప్పటికీ ఈ రోజు వరకూ ఆయన ఆ విషయంపై ఎక్కడా కూడా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, రాష్ట్ర మంత్రులు, పార్టీ ఇన్ చార్జీలు దానిపై మాట్లాడుతున్నా పార్టీ అధినేతగా జగన్ మాత్రం బాబు అరెస్ట్ పై మాట్లాడలేదు. అరెస్ట్ తదనంతర పరిస్థితులపై నిఘా వర్గాలతో పాటు సొంత టీం ద్వారా సమాచారం తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగుతున్నారు. టీడీపీ మాత్రం చంద్రబాబు అరెస్ట్ దృష్ట్యా నిరసన కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టి రాజకీయ కక్ష సాధింపు జరుగుతుందన్న మాటను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తుంది. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు పట్ల, టీడీపీ పట్ల సానుభూతి పెరిగుతుందని రాజకీయ పరిశీలకులు పేర్కోంటున్నారు. సీ ఓటర్ సర్వేలో కూడా ఇదే విషయం వెల్లడైన నేపధ్యంలో రాజకీయ పక్షాల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతుంది. ఎన్నికల నాటికి మరేమి జరుగుతుందోననేది వేచిచూస్తేనే తెలుస్తొంది.