కాంగ్రెస్‌లో ‘బీసీ’ ఇష్యూ..సీట్లు లేవా?

తెలంగాణ ఎన్నికల్లో ఈ సారి ఎలాగైనా గెలిచి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి సీట్ల ఎంపిక పెద్ద టాస్క్ అయిపోయింది. ఓ వైపు బి‌ఆర్‌ఎస్ సీట్లు ఖరారు చేసుకుని దూసుకెళుతుంది. కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దీంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఒకో సీటుకు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పోటీ పడుతున్నారు. కొన్ని సీట్లకు పది మందిపైనే పోటీ పడుతున్నారు. దీంతో అభ్యర్ధుల ఎంపిక తలనొప్పిగా మారింది.

అందులో ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా బలమైన నేతని ఎంపిక చేయాలి. అదే సమయంలో బి‌సి అభ్యర్ధులని ఎంపిక చేయడం పెద్ద టాస్క్ అయింది. ఇప్పటికే పార్లమెంట్‌కు 2 అసెంబ్లీ సీట్లు బి‌సిలకు కేటాయిస్తామని..మొత్తం 34 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఆ 34 సీట్లు ఖచ్చితంగా బి‌సిలకే కేటాయించాలని డిమాండ్ వస్తుంది. సర్వేల పేరుతో అగ్రకులాల వారికి సీట్లు ఇచ్చినంత మాత్రాన వారు గెలుస్తారనే నమ్మకం లేదని అంటున్నారు.

ఎందుకంటే గత ఎన్నికల్లో  జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, పద్మావతీరెడ్డి, జీవన్‌రెడ్డి తదితర అగ్రకులానికి చెందిన అభ్యర్థులు ఓడిపో లేదా అని బి‌సి నేతలు ప్రశ్నిస్తున్నారు. రేవంత్‌రెడ్డి చెప్పిన విధంగా వచ్చే ఎన్నికల్లో ఓబీసీలకు 34 స్థానాలు కేటాయించాల్సిందేనని మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. కాంగ్రెస్‌ బలపడడంలో బహుజనుల పాత్రా ఉందన్నారు. వారి పాత్ర లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. సర్వేలపై ఆధారపడి ఎన్నికలు జరగవన్నారు.

ఇలా బి‌సిల సీట్లపై చర్చలు జరుగుతున్నాయి. అయితే 34 సీట్లు బి‌సిలకు దక్కే అవకాశాలు తక్కువ. వాటిల్లో కోతలు పడే అవకాశం ఉంది. అలా సీట్లు దక్కని వారికి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీలు ఇచ్చే ఛాన్స్ ఉంది.