కాక రేపుతున్న తెలంగాణ పాలిట్రిక్స్…!

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని ప్రధాన పార్టీల నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణ విమోచన దినోత్సవం రోజునే ఇద్దరు అగ్రనేతలు తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఒకేరోజు తెలంగాణలో పర్యటించనున్నారు.

సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించేందుకు ఏర్పాట్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 17న ప్రధానమంత్రి మోదీ సభకు బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మోదీ సమయం కోరారు కూడా. గతేడాది కూడా సెప్టెంబర్‌ 17న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌ వచ్చారు.

హైదరాబాద్ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో మోదీ బహిరంగ సభకు బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేతలు కూడా హైదరాబాద్‌లో సోనియా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సోనియా చేత కాంగ్రెస్ మ్యానిఫెస్టో రిలీజ్‌ చేసేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది.

అటు బీఆర్ఎస్ పార్టీ నేత కేటీఆర్ కూడా ఇప్పటికే బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేసేందుకు కేటీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే పార్టీ నేతలతో కేటీఆర్ చర్చించారు. ఈ పర్యటన కూడా సెప్టెంబర్‌ 17న ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.