ఆ మూడు సినిమాలు మిక్సీలో వేసి కొడ‌తే `ఖుషి`నా.. ఇదెక్క‌డి త‌ల‌నొప్పి రా బాబు..?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ, సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత జంట‌గా న‌టించిన చిత్రం `ఖుషి`. మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మైన ఈ రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్టైన‌ర్ కు శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జయరాం, సచిన్ ఖేడకర్, మురళీ శర్మ, లక్ష్మి, అలీ, రోహిణి, వెన్నెల కిశోర్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 1న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఈ నేప‌థ్యంలోనే రీసెంట్ గా మేక‌ర్స్ ఖుషి ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. విప్లవ్(విజ‌య్ దేవ‌ర‌కొండ‌), ఆరాధ్య (సమంత) లవ్ చేసుకోవడం, ఇరు కుటుంబాలు ఒప్పుకోకపోవడం, వారిద్దరూ బయటికి పెళ్లి చేసుకోవడం, వారి మధ్య గొడవలు జరగడం, ఎమోషన్ సీన్లతో ఫీల్ గుడ్ గా ట్రైల‌ర్ కొన‌సాగింది. ల‌వ్, కామెడీ, రొమాన్స్‌, ఎమోష‌న్స్‌.. ప్ర‌ధానంగా సినిమా సాగుతుంద‌ని ట్రైల‌ర్ తో స్ప‌ష్ట‌మైంది. అయితే ఇదే త‌రుణంలో ఓ వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. దేశముదురు, అంటే సుందరానికి, గీతగోవిందం.. ఈ మూడు సినిమాలు మిక్సీలో వేసి కొడ‌తే ఖుషి అంటూ కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఖుషి ట్రైల‌ర్ లో ఈ మూడు సినిమాల షేడ్స్ స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయ‌ని చ‌ర్చించుకుంటున్నారు. కాశ్మీర్ వెళ్లిన కుర్రాడికి ఓ ముస్లిం అమ్మాయి కనిపించటం, వెంటపడి ప్రేమించడం, ఆ త‌ర్వాత ఆ అమ్మాయి గురించి ఓ షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవ్వ‌డం దేవ‌ముదురులో చూశాము. ఒక‌రు బ్రాహ్మిణ్‌, మ‌రొక‌రు క్రీస్టియ‌న్ అవ్వ‌డం వ‌ల్ల‌.. ఇంట్లో వాళ్లు పెళ్లి ఒప్పుకోక‌పోవ‌డం వంటివి నాని అంటే సుందరానికి గుర్తుచేస్తున్నాయి. ఇక ఇద్దరి మధ్య మనస్పర్ధలు.. అపార్ధాలు.. పెళ్లి ఇదంతా బ్లాక్ బస్టర్ సినిమా గీతగోవిందం టచ్ కనిపించింది. మొత్తంగా ఈ మూడు సినిమాల‌ను క‌లిపి ఖుషిని తెర‌కెక్కించార‌ని నెటిజ‌న్లు చ‌ర్చించుకుంటున్నారు. ఓవ‌రాల్ గా రెగ్యులర్ కంటెంట్ తో వ‌స్తున్న ఖుషి.. విజ‌య్‌, స‌మంత‌ల‌కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.