విశాఖలో టీడీపీ-జనసేన సీట్ల పంచాయితీ.!

అధికారికంగా టి‌డి‌పి-జనసేన పొత్తుపై ఎలాంటి ప్రకటన రాలేదు.. కానీ ఆ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయనే అంశంపై మాత్రం చర్చ నడిచిపోతుంది. పైగా ఇటీవల జనసేన నేత నాదెండ్ల మనోహర్..త్వరలోనే జనసేన ఏ సీట్లలో పోటీ చేస్తుందో చెబుతామని అన్నారు. అంటే అన్నీ సీట్లలో జనసేన పోటీ చేయడం లేదు. దీని బట్టి చూస్తే టి‌డి‌పితో పొత్తు రెడీ అయినట్లే.

అందుకే ఆ రెండు పార్టీల మధ్య సీట్ల విషయంలో చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తున్నాయి. అయితే అధినేతలు మధ్య చర్చ జరగడం లేదు గాని..నేతల మధ్య పంచాయితీ నడుస్తోంది. కొన్ని సీట్ల విషయంలో రెండు పార్టీలు గట్టి పట్టు పడుతున్నాయి. ఇదే క్రమంలో ఉమ్మడి విశాఖలోని సీట్లపై పంచాయితీ నెలకొంది. వాస్తవానికి విశాఖలోని 15 సీట్లలో టి‌డి‌పికి పట్టు ఉంది. కానీ జనసేనకు కొన్ని సీట్లపై పట్టు ఉంది. అది కూడా సొంతంగా గెలిచే బలం లేదు గాని, గెలుపోటములని తారుమారు చేయగలదు.

అంటే తమ సపోర్ట్ లేనిదే టి‌డి‌పి గెలవలేదు కాబట్టి..అలాంటి సీట్లు జనసేనకు ఇవ్వాలని కోరుతున్నారు. విశాఖలో ముఖ్యంగా విశాఖ నార్త్, భీమిలి, గాజువాక, పెందుర్తి, ఎలమంచిలి, అనకాపల్లి సీట్ల విషయంలో పంచాయితీ నడుస్తోంది. ఈ సీట్లపై జనసేన ఫోకస్ పెట్టింది. కనీసం 4 సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. కానీ ఈ అన్నీ సీట్లలో టి‌డి‌పికి బలం ఉంది. ఆ పార్టీ ఏమో వదులుకోవడానికి సిద్ధంగా లేదు.

దీంతో విశాఖలో సీట్ల విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంది. ఇక ఏదైనా చంద్రబాబు-పవన్ కూర్చుని తేల్చుకోవాల్సిందే.