బాలీవుడ్ హీరోయిన్ ను తిట్టిన రానా.. ఇప్పుడిలా ట్విస్ట్ ఇచ్చాడేంటి..?

మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ పాన్ ఇండియా మూవీ `కింగ్ ఆఫ్ కోతా` విడుదల‌కు సిద్ధ‌మైంది. ఇటీవ‌ల ఈ సినిమాను తెలుగులో ప్ర‌మోట్ చేసేందుకు మేకర్స్ హైద‌రాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వ‌మించ‌గా.. నాని, రానా ద‌గ్గుబాటి గెస్ట్‌లుగా హాజ‌రు అయ్యారు. అయితే ఈ ఈవెంట్ లో రానా పేరు ప్ర‌స్తావించ‌కుండా ఓ బాలీవుడ్ హీరోయిన్ దుల్కర్ సల్మాన్ సమయాన్ని దుర్వినియోగం చేసిందంటూ తిట్టిన సంగ‌తి తెలిసిందే.

ఆమె చేసిన ప‌నికి అక్క‌డ ఉన్న తానే కోపం చేతిలో ఉన్న బాటిల్ ప‌గ‌ట‌గొట్టాను.. కానీ, దుల్క‌ర్ మాత్రం కూల్ గా ఎంతో ఓర్పుతో ఉన్నాడ‌ని రానా వ్యాఖ్య‌లు చేశాడు. దాంతో నెటిజ‌న్లు ఆమె ఎవ‌రా అని ఆరాలు తీయ‌గా.. సోనమ్ కపూర్ అని బ‌య‌ట‌ప‌డింది. దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్ కలసి జోయా ఫ్యాక్టర్ లో నటించారు. ఆమెనే దుల్క‌ర్ టైమ్ వేస్ట్ చేసింద‌ని.. రానా కోపానికి కార‌ణం అయింద‌ని చెప్పి నెటిజ‌న్లు సోన‌మ్ ను ఓ రేంజ్ లో కేస్తున్నారు. అయితే ఇంత‌లోనే రానా ట్విస్ట్ ఇచ్చాడు. నేనేదో స‌ర‌దాగా ఆ కామెంట్స్ చేశానని పేర్కొంటూ సోనమ్ కు క్ష‌మాప‌ణ‌లు తెలిపారు. ఈ మేర‌కు ఓ ట్వీట్ చేశాడు.

`నేను మాట్లాడిన మాటలతో సోనమ్ పై బాగా వ్యతిరేకత చూపిస్తున్నారు. అది న‌న్ను ఎంతో బాధ పెడుతోంది. నిజానికి అది తేలికగా తీసుకోవాల్సిన విషయం. ఆమె కూడా నా స్నేహితురాలే. స్నేహితుల మాదిరి మేము తరచూ సరదాగా ఆట పట్టించుకుంటాం. నా మాటలు తప్పుగా అర్ధం చేసుకొని ఆమెను టార్గెట్ చేసినందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా సోనమ్ కపూర్, దుల్కర్ సల్మాన్ కి హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. ఇప్ప‌టికైనా ఈ వివాదానికి ముగింపు ప‌ల‌కండి` అంటూ రానా త‌న ట్వీట్ లో పేర్కొన‌గా.. అది కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది.