`జైల‌ర్‌` మూవీ తెలుగు బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే ర‌జ‌నీ ఎంత రాబ‌ట్టాలో తెలుసా?

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ మ‌రో రెండో రోజుల్లో `జైల‌ర్‌` మూవీతో సంద‌డి చేసేందుకు రెడీ అయిన సంగ‌తి తెలిసిందే. సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన‌ ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వహించాడు. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా తొలిసారి ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ తో జ‌త‌క‌ట్టింది. అలాగే క‌న్న‌డ స్టార్ శివరాజ్‌కుమార్‌, మ‌ల‌యాళ మెగాస్టార్ మోహన్ లాల్, రమ్యకృష్ణ వంటి వారు ఈ సినిమాలో భాగం అయ్యారు.

ఈ సినిమా ఆగ‌స్టు 10న తెలుగు, త‌మిళ భాష‌ల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వాస్త‌వానికి రోబో చిత్రం త‌రువాత ర‌జినీకాంత్‌కు ఆ స్థాయిలో హిట్ రాలేదు. క‌బాలి, కాలా, 2.0, ద‌ర్భార్, పెద్ద‌న్న‌.. ఇలా ర‌జ‌నీకాంత్ న‌టించిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. దీంతో జైల‌ర్ మూవీకి మొద‌ట ఎలాంటి హైప్ లేదు. కానీ, ట్రైల‌ర్ విడుద‌ల త‌ర్వాత ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. ఒక్క‌సారిగా సినిమాపై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ర‌జ‌నీకాంత్ `జైల‌ర్‌` మూవీతో ఖ‌చ్చితంగా కంబ్యాక్ ఇస్తాడ‌ని అభిమానులే కాదు సినీ ప్రియులు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. బిజినెస్ సైతం భారీ స్థాయిలో జ‌రింది. తాజాగా జైల‌ర్ మూవీ తెలుగు బిజినెస్ లెక్క‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తెలుగులో జైల‌ర్ చిరంజీవి భోళా శంక‌ర్ తో పోటీ ప‌డుతోంది. అయినా కూడా ఈ సినిమాకు సాలిడ్ బిజినెస్ జ‌రిగింది.

నైజాంలో రూ. 4.50 కోట్లు, సీడెడ్ లో రూ. 2.50 కోట్లు, ఆంధ్రాలో రూ. 5 కోట్లకు ఈ సినిమా థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడుపోయాయి. దీంతో తెలుగులో ఈ సినిమాకు మొత్తంగా రూ. 12 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌రిగింది. ఈ లెక్క‌ల జైల‌ర్ తెలుగులో క్లీన్ హిట్ అవ్వాలంటే ర‌జ‌నీ రూ. 13 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకోవాల్సి ఉంటుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వ‌స్తే.. ర‌జనీకాంత్ కి ఇదేమి పెద్ద టార్గెట్ కాద‌నే చెప్పొచ్చు.