బీజేపీతో బాబు..పురందేశ్వరి కష్టం..వారికి అంతా తెలుసా?

బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో బి‌జే‌పి మద్ధతు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార బలం లేకపోతే..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని తట్టుకోవడం కష్టమనే పరిస్తితి. ఈ నేపథ్యంలోనే బాబు ఎలాగైనా బి‌జే‌పికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే తన కోవర్టుల ద్వారా బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అటు పవన్‌ని సైతం ఈ విషయంలో బాగానే వాడుతున్నారు. పవన్ ద్వారా బి‌జే‌పికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ మధ్య అమిత్ షాని కలిసే అవకాశం వచ్చింది. తాజాగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలని పురస్కరించుకుని..ఎన్టీఆర్ రూ.100 నాణెంని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబం పాల్గొంది. ఇటు అల్లుళ్లు అయినా దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబులు సైతం పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం దగ్గుబాటి పురందేశ్వరి చూసుకున్నట్లు తెలిసింది.

ఈ కార్యక్రమానికి బి‌జే‌పి జాతీయ అధ్యక్షుడు జే‌పి నడ్డాని సైతం ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బాబు, నడ్డా, పురందేశ్వరి, రఘురామకృష్ణంరాజు, సి‌ఎం రమేష్ ఇలా కొందరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పురందేశ్వరి..తన మరిది చంద్రబాబుని బి‌జే‌పికి దగ్గర చేసేందుకు కష్టపడుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.  “ ఇంతకంటే ఆధారం కావాలా? చిన్నమ్మా! పురంధేశ్వరి! పతీసమేతంగా మరిదిని తీసుకెళ్లి మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో చెప్పే ప్రయత్నం. బీజేపీకి తెలీదా, మీరంతా ఒకటే అని. అందుకేకదా దొంగ చేతికే తాళం ఇచ్చింది!” అని సాయిరెడ్డి ఫైర్ అయ్యారు. మొత్తానికి బాబుని బి‌జే‌పికి దగ్గర చేయడానికి పురందేశ్వరి కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నారు.