పల్నాడు వైసీపీ నేతల్లో స్థాన చలనం తప్పదా…!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక ప్రాంతమైన పల్నాడు జిల్లాలో సత్తా చాటేందుకు అధికార, ప్రతిపక్షాల అధినేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతి సమీప జిల్లా కావడంతో… ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ… అభ్యర్థుల ఎంపికపైన ప్రధాన పార్టీలు తలమునకలై ఉన్నాయి. అధికార పార్టీలో అయితే సిట్టింగ్ అభ్యర్థుల మార్పు తప్పదనే పుకార్లు సైతం ఇప్పటికే షికార్లు చేస్తున్నాయి.

పల్నాడు ప్రాంతంలోని కీలక నియోజకవర్గాల్లో ఈసారి అభ్యర్థుల మార్పు తప్పదనే ప్రచారం అధికార వైసీపీలో బలంగా వినిపిస్తోంది. కీలకమైన మాచర్ల నియోజకవర్గం నుంచి ఇప్పటికే వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఈ సారి మాత్రం మరో స్థానానికి పంపుతున్నట్లు తెలుస్తోంది. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. అయితే ప్రస్తుతం ఆయనపై నియోజకవర్గంలో కొంత అసంతృప్తి ఉన్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి. మునిసిపల్ ఎన్నికల్లో పిన్నెల్లి వ్యవహరించిన తీరుతో పాటు ఆయన సోదరుడు రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్లకు బదులుగా గురజాల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం గురజాల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కాసు మహేశ్ రెడ్డి… రాబోయే ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం నరసరావుపేట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే ఈ మాటను సీఎం జగన్‌ మోహన్ రెడ్జికి తెలిపినట్లు కాసు సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికే నరసరావుపేట నుంచి డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈయనపై ఇప్పటికే నియోజకవర్గంలోని ఒక వర్గం వైసీపీ నేతలు కొంత ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో ప్రస్తుతం ఎంపీ లావు కృష్ణదేవరాయలుతో ఏ మాత్రం సన్నిహితంగా వెలగటం లేదు. దీంతో రాబోయే ఎన్నికల్లో గోపిరెడ్డికి బదులుగా కాసు మహేశ్ పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం సత్తెనపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అంబటి రాంబాబు… వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో రాంబాబు స్థానంలో ఎవరికి అవకాశం ఉంటుందనే విషయం జోరుగా చర్చ నడుస్తోంది. మంగళగిరి నుంచి చేనేత సామాజిక వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తే… ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని సత్తెనపల్లికి మార్చే అవకాశం ఉంటుందనేది జోరుగా వినిపిస్తున్న మాట. ఇక తాడికొండ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డా. ఉండవల్లి శ్రీదేవిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో అక్కడ నుంచి డొక్కా మాణిక్య వరప్రసాద్ పోటీ చేయడం దాదాపు ఖాయమే.

మరి అధినేత ఆలోచన ఉందో… మార్పులు చేర్పులపై ఎలా స్పందిస్తారో అనేది ప్రస్తుతం వైసీపీ నేతలు మల్లగుల్లలు పడుతున్నారు. సీనియర్లను మార్చేది లేదని ఇప్పటికే జగన్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో నేతల మార్పులపై జగన్ నిర్ణయం ఎలా ఉంటుందనేది తేలాల్సి ఉంది.