కొత్తపేటపై లొల్లి..జనసేనకు టీడీపీ షాక్.!

అటు టీడీపీకి, ఇటు జనసేనకు బలం ఉండి..వైసీపీ సిట్టింగ్ సీటుగా ఉన్న కొత్తపేటలో రాజకీయం ఇప్పుడు వాడివేడిగా సాగుతుంది. ఇటీవలే ఇక్కడ పవన్ పర్యటించి వెళ్లారు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పర్యటించారు. ఇద్దరు నేతలు వైసీపీనే టార్గెట్ చేశారు. చంద్రబాబు కొత్తపేటలో వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఇసుకలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇసుక ర్యాంప్‌ల వద్ద సెల్ఫీలు కూడా దిగారు.

ఇక రావులపాలెం సెంటర్ లో భారీ సభ ఏర్పాటు చేశారు.అయితే అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ వైసీపీ ప్రత్యర్ధిగా ఎవరు బరిలో దిగుతారనేది ప్రశ్నార్ధకంగా మారింది. వైసీపీ నుంచి చిర్ల జగ్గిరెడ్డి పోటీ చేయడం ఖాయం. ఈయన కొత్తపేటలో మూడుసార్లు గెలిచారు. మూడుసార్లు కూడా టి‌డి‌పిపై స్వల్ప మెజారిటీలతోనే గెలిచారు. 2004లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఈయన కేవలం 2,271 ఓట్ల తేడాతో గెలిచారు. 2009లో ప్రజారాజ్యం చేతిలో ఓడిపోయారు. 2014లో టి‌డి‌పిపై 713 ఓట్ల తేడాతో గెలిచారు. 2019లో 4 వేల ఓట్ల తేడాతో గెలిచారు.

ఇలా మూడుసార్లు తక్కువే మెజారిటీలతోనే గెలిచారు. వరుసగా తక్కువ మెజారిటీలతో ఓడిపోవడంతో ఇక్కడ టి‌డి‌పిపై సానుభూతి ఉంది. అలా అని ఈ సీటులో జనసేనకు గత ఎన్నికల్లో 35 వేల ఓట్లు పైనే పడ్డాయి. అలాంటప్పుడు ఓట్ల చీలిక టి‌డి‌పికి నష్టం. ఒకవేళ టి‌డి‌పి-జనసేన పొత్తు ఉంటే సీటు ఎవరికి దక్కుతుందనేది ప్రశ్న.జనసేన మద్ధతు లేకుండా ఇక్కడ టి‌డి‌పి గెలవలేదు.

అలా అని జనసేనకు సీటు ఇస్తే టి‌డి‌పి ఓట్లు బదిలీ కావడం చాలా కష్టం. గత ఎన్నికల్లో టి‌డి‌పికి 78 వేలు, జనసేనకు 35 వేలు ఓట్లు పడ్డాయు. కాబట్టి ఈ సీటు టి‌డి‌పి వదులుకోదు. ఇక పొత్తులో ఎవరు పోటీ చేసిన..రెండు పార్టీల ఓట్లు కలిస్తేనే వైసీపీని ఓడించగలవు లేదంటే గెలుపు కష్టమే.