కేసీఆర్‌కు ‘రైతు’లు కలిసొస్తారా?

రాజకీయాల్లో గెలుపోటములని శాసించేది ప్రధానంగా మహిళలు, రైతులు, యువత అనే చెప్పాలి. అందుకే ఏ పార్టీ అయిన ఈ మూడు వర్గాలని ఆకట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడటంతో ప్రధాన పార్టీలు ఈ మూడు వర్గాలని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ..మూడు వర్గాల ఓట్లని కొల్లగొట్టేందుకు చూస్తుంది.

అయితే తెలంగాణ వచ్చిన అనుకున్న మేర యువతకు ఉద్యోగాలు రాలేదు. ఈ అంశంలో యువత కాస్త యాంటీగానే ఉంది. ఈ విషయం స్వయంగా కే‌టి‌ఆర్ సైతం ఒప్పుకున్నారు. కానీ నిదానంగా వారిని తమవైపుకు తిప్పుకునేలా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక రైతు రుణమాఫీ అని చెప్పి కే‌సి‌ఆర్ 2018 ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కానీ దాన్ని పూర్తిగా నెరవేర్చలేదు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు..రుణమాఫీ చేశారు. కానీ 2018లో ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోలేదు.

2018లో గెలిచి అధికారంలోకి వచ్చాక రుణమాఫీ పూర్తి చేయలేదు. కేవలం 50 వేలు లోపు ఉన్న రుణాలని మాఫీ చేశారు. కానీ లక్ష లోపు రుణాలని పట్టించుకోలేదు. అయితే ఈ రుణాలు కట్టలేక..వాటికి వడ్డీలు పెరిగిపోయి రైతులు నానా అవస్థలు పడ్డారు. పైగా బ్యాంకులు..రైతుల అకౌంట్లని సైతం నిలిపివేశాయి. రైతు బంధు ఇస్తున్నారు..కానీ రుణమాఫీ చేయకపోవడం వల్ల..కొందరు రైతులు అప్పులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

దీంతో రైతుల్లో కే‌సి‌ఆర్ సర్కార్ పై వ్యతిరేకత కనిపించింది. ఈ పరిణామాలని దృష్టిలో పెట్టుకుని తాజాగా కే‌సి‌ఆర్..లక్ష లోపు రుణాలని కేవలం 45 రోజుల్లో మాఫీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సుమారుగా 31 లక్షల మంది రైతులకు రూ. 20,351 కోట్ల మేర మాఫీ చేయాల్సి ఉంది.  మరి ఈ మాఫీ పూర్తి చేస్తే రైతులు..కే‌సి‌ఆర్ సర్కార్‌కు కలిసొస్తారు. లేదంటే ఎన్నికల్లో రిస్క్ తప్పదు.