పాత మిత్రుల మధ్య చిగురించిన కొత్త స్నేహం…!

పైకి పొత్తులు… లోపల మాత్రం కడుపులో కత్తులతో నిన్న, మొన్నటి వరకూ స్నేహం చేసిన బీజేపీ, జనసేన నేతలు పాత వైరానికి స్వస్తి పలికారు. అధ్యక్షుడు మారిన వెంటనే కొత్త స్నేహానికి తెరలేపారు. చాలా రోజుల తరువాత రాజకీయంగా అరుదైన దృశ్యం కనిపించింది. పంచాయితీల నిధుల మళ్లింపు, సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం పై అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు బీజేపీ ఇచ్చిన ధర్నా పిలుపునకు జనసేన కూడా మద్దతు పలికింది. జనసేన, బీజేపీ జెండాలు ధర్నా శిబిరాల వద్ద దర్శనమివ్వడం రెండు పార్టీల నేతలు, కార్యకర్తల్లో జోష్ నింపింది.

నిన్న, మొన్నటి వరకూ పొత్తులో ఉన్నప్పటికీ ఉప్పు, నిప్పుగా ఉన్న జనసేన, బీజేపీ మధ్య మళ్లీ స్నేహాం చిగురించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా సోము వీర్రాజును తొలగించి దగ్గుబాటి పురంధేశ్వరిని నూతన అధ్యక్షురాలిగా నియమించిన తరువాత కొత్త స్నేహం ప్రారంభమైంది. సోము పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్ర బీజేపీలో నలుగురు నేతలు ఆడిందే ఆట… పాడిందే పాటగా మారింది. అమరావతే ఏకైక రాజధాని అని తీర్మానం చేసిన బీజేపీ… ఆ ఉద్యమానికి మద్దతు ఇచ్చారని కొంతమంది నేతలను సస్పెండ్ చేయడం బీజేపీ క్యాడర్, లీడర్‌లు జీర్ణించుకోలేకపోయారు. అదే విధంగా అధికార పార్టీకి అవసరమైన సందర్భాల్లో వత్తాసు పలకడమే కాకుండా రాష్ట్రంలో బీజేపీ, వైసీపీ ఒకటే అనే భావనలోకి పార్టీని తీసుకెళ్లారు. అనేక మంది ఫిర్యాదు చేసినప్పటికీ, రాష్ట్ర బీజేపీకి అధ్యక్షుడిగా ఎన్నికల వరకూ సోము వీర్రాజు ఉంటారని సాక్ష్యాత్తు రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్‌ చెప్పడం చర్చనీయాంశమైంది. హైకమాండ్‌కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వెళ్లడంతో సోము వీర్రాజును తొలగించి దగ్గుబాటి పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించారు. అంతకు ముందే జనసేనతో సోము వీర్రాజు అంటిముట్టనట్టుగా వ్యవహరించారు. ఎవరికి వారు ఆందోళనలు నిర్వహించుకున్నారు. ఉప ఎన్నికల్లో కూడా జనసేనకు చెప్పకుండా ఏకంగా అభ్యర్ధులను ప్రకటిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకోవడంపై జనసేన నేతలు బీజేపీ అగ్ర నేతలకు ఫిర్యాదు చేశారు. అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి వత్తాసు పలకడంపై కూడా పవన్‌ కళ్యాణ్‌ సాక్ష్యాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడికి కూడా ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజుని తొలగించి పురంధేశ్వరిని నియమించిన తరువాత రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ప్రారంభమయ్యాయి. పురందేశ్వరి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత… పంచాయితీల వ్యవహారంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాకు ఒక్కో సీనియర్ నేతను నియమించారు. ఈ ఆందోళన కార్యక్రమం చేస్తున్నట్లు బీజేపీ నేతలు జనసేనకు కూడా సమాచారం ఇవ్వడంతో ఆ పార్టీ నాయకత్వం తమ పార్టీ నేతలు, సర్పంచ్‌లను కూడా మహాధర్నాలో పాల్గొనాలని ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జనసేన నేతలు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాష్ట్రంలో దాదాపుగా మూడు సంవత్సరాల తరువాత బీజేపీ, జనసేన కలిసి ఆందోళనలు నిర్వహించడం నూతన రాజకీయ పరిణామంగా అందరూ భావిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో జనసేన, బీజేపీ మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన తరువాత రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. పైకి పొత్తులని చెబుతున్నప్పటికీ, కడుపులో కత్తులు పెట్టుకొని స్నేహం చేశారు. ఏడాది కాలంగా రెండు పార్టీల నేతల మధ్య మాటలు కూడా కరువయ్యాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరు పై జనసేన తీవ్ర అసంతృప్తిని సాక్ష్యాత్తు బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద వ్యక్తం చేసింది. ఎట్టకేలకు అధ్యక్షుని మార్పుతో పాత మిత్రుల మధ్య కొత్త స్నేహం ప్రారంభమైంది.