కేసీఆర్ సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్న పథకాలు…!

ఎన్నికల ముందు కేసీఆర్ ప్రభుత్వం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలు అధికార పార్టీలో చిచ్చుపెడుతున్నాయి. లబ్దిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలకు పవర్స్ ఇవ్వడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వస్తోంది. మెజార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే వర్సెస్ లోకల్ లీడర్స్‌గా సీన్ మారుతోంది.

ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని పట్టుదలగా ఉన్న కేసీఆర్ అందుకోసం సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రెండు పర్యాయాల పాలనపై అసంతృప్తిగా ఉన్న ప్రజలను ఆకర్షించడానికి వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఒక్కో వర్గాన్ని మచ్చిక చేసుకోవడానికి ఎన్నికల పథకాలను ప్రకటిస్తున్నారు. హుజూరాబాద్ ఎలక్షన్ సమయంలో తెచ్చిన దళిత బంధును వచ్చే అసెంబ్లీ ఎన్నికల ముంగిట నియోజకవర్గానికి 1100 మందికి ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కుల వృత్తులకు లక్ష, మైనార్టీలకు లక్ష సాయం పథకాన్ని ప్రకటించారు. అందుకోసం ఇప్పటికే లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక ఇప్పుడు గృహలక్ష్మి పథకం కోసం సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

2018 ఎన్నికల ముందు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఇక దళిత బంధు అందరికీ ఒకేసారి ఇవ్వాలని ఆ వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు దళితులకు ఇచ్చినట్లే తమకు పది లక్షల బంధు ఇవ్వాలని అటు బీసీలు ఇటు మైనార్టీ వర్గాల ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో ఆయా వర్గాలు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఉన్నట్లు గుర్తించిన కేసీఆర్ ఎన్నికల ముందు జిమ్మిక్కులు స్టార్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజల కోపాన్ని చల్లార్చే వ్యూహంలో భాగంగానే తాజా పథకాల ప్రకటన అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రకటనలు ఆయావర్గాల మీద ప్రేమకంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టే స్కెచ్ అనే మాట వినిపిస్తోంది. లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటే ఒక్కో గ్రామానికి పదుల సంఖ్యలో మాత్రమే సాయం అందించడం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థం అవుతోందని అంటున్నారు.

ఎన్నికల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం వేసిన ప్లాన్ ఇప్పుడు బెడిసికొడుతోంది. లబ్దిదారుల ఎంపిక, పథకాల పురోగతిపై సెక్రటేరియట్ లో సమావేశం జరిగింది. అందులో లబ్దిదారుల ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించారు. అదే ఇప్పుడు అధికార పార్టీలో అలజడి రేపుతోంది. సొంత నేతల మధ్యనే చిచ్చుపెట్టింది. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు ముదిరింది. చాలా చోట్ల ఎమ్మెల్యేలకు, స్థానిక నేతలకు పోసగడం లేదు. ఎమ్మెల్యేల అనుచరులు పథకాల లబ్దిదారుల ఎంపికలో వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇక దళిత బంధులో ఎమ్మెల్యేల అవినీతి చిట్టా తన వద్ద ఉందని స్వయంగా సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు బెనిఫిషర్స్ సెలక్షన్ పవర్ ఎమ్మెల్యేలకు ఇవ్వడం పట్ల సొంత పార్టీలోని స్థానిక సంస్థల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యేలకు పవర్స్ ఇవ్వడం వల్ల తమ అనుచరులకు మాత్రమే అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మునిసిపల్ కార్పొరేషన్లలో కనీసం కార్పొరేటర్లు సూచించిన వారిని పక్కన పెడుతున్నారట. ఇక చాలా నియోజకవర్గాల్లో మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలున్నారు. అటు టీడీపీ నుంచి ఇటు కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలున్నారు. అయితే ఎమ్మెల్యేలు అందరినీ సమానంగా చూడకుండా తమ వెంట వచ్చిన వారికే ప్రభుత్వ పథకాలలో అవకాశం ఇస్తున్నారని మిగిలిన వారు మండిపడుతున్నారు. మొదటి నుంచి తమ వెంట ఉన్నవారికి ప్రభుత్వ పథకాల్లో అవకాశం ఇవ్వకపోతే రేపు ఎన్నికల్లో వారిని ఎలా ఓటు అడుగుతారని ప్రశ్నిస్తున్నారు. దాంతో వారంతా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా జట్టు కడుతున్నారు. ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించేందుకు తీసుకువస్తున్న పథకాలు సొంత పార్టీ నేతల మధ్య చిచ్చు పెట్టడంతో అధికార పార్టీలో ఆందోళన కలిగిస్తోంది.