మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల చిరంజీవి చేసిన కామెంట్లను ఉద్దేశించి కౌంటర్ ఇస్తూ ప్రకాష్ రాజ్ పోకిరి సినిమాలో చెప్పిన డైలాగును ప్రస్తావించారు. గిల్లితే గిల్లించుకోవాల్సిందే అనే డైలాగులు సినిమాల్లో బాగుంటాయి కానీ.. రాజకీయాల్లో గిల్లితే తిరిగి గిల్లుతారు అంటూ తనదైన స్టైల్లో స్పందించారు. కరెక్టే.. పేర్ని నాని చెప్పింది కరెక్టే.. గిల్లితే తిరిగి గిల్లాల్సిందే. బ్రో సినిమాలో అంబటి రాంబాబు పాత్రను పెట్టారనే వివాదాన్ని మనస్సులో పెట్టుకుని పార్లమెంటులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హీరోల రెమ్యూనరేషన్ల గురించి ప్రస్తావించారు. దానిపై చిరంజీవి స్పందించారు. ఇప్పుడు వివాదం అంతా దీని చుట్టూనే తిరుగుతోంది. ఈ సందర్భంగా ఓ చర్చ తెర మీదకు వస్తోంది. హీరోల రెమ్యూనరేషన్లపై వైసీపీ నేతలు ఇప్పుడు కొత్తగా మాట్లడుతున్నదేం కాదు. గతంలోనూ ఇదే తరహాలో అనిల్ కుమార్ యాదవ్ పవన్ టార్గెట్‌గా హీరోల రెమ్యూనరేషన్ల విషయాన్ని ప్రస్తావించారు. మరి అప్పుడు చిరంజీవి ఎందుకు మాట్లాడలేదు..? ఇప్పుడు ఎందుకు మాట్లాడారు..? అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ.
అయినా దీనికి కారణాలు లేకపోలేదంటున్నాయి జనసేన, సినీ వర్గాలు. గతంలో అనిల్ కుమార్ యాదవ్ చేసిన కామెంట్లు రాజకీయ కోణంలో చేశారు. ప్రెస్ మీట్లల్లో ఈ కామెంట్లు చేశారు. దీంతో చిరంజీవి కూడా చూసీ చూడనట్టుగా వదిలేశారట. కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి ఏకంగా భారత పార్లమెంటులో పెద్దల సభలో హీరోల రెమ్యూనరేషన్ల గురించి మాట్లాడేశారు. పార్లమెంటులో చర్చించాల్సిన అంశాలు ఇవా..? అనే బాధతోనే చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కామెంట్లు చేశారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో గిల్లుడు థియరి వైసీపీ నేతలకు వర్తించదా..? అని కూడా ప్రశ్నిస్తున్నారు జనసేన నేతలు. సంబంధం లేకుండా హీరోల రెమ్యూనరేషన్ల గురించి పార్లమెంటులో ప్రస్తావించడం ద్వారా సినీ ఇండస్ట్రీని గిల్లిన విజయసాయి రెడ్డిని.. వైసీపీని చిరంజీవి గిల్లితే తప్పేంటీ అంటున్నారు. దీనికి పెద్దగా ఫీలైపోయి.. పేర్ని నాని గిల్లుడు పురాణం వల్లె వేయడం దేనికనేది జనసేన వేస్తున్న ప్రశ్న.
ఇక చిరంజీవి కామెంట్లపై ముందుగా స్పందించిన వైసీపీ నేత కొడాలి నాని. పకోడిగాళ్లు చాలా మంది ఉన్నారు వారికి సలహాలివ్వాలంటూ కొడాలి నాని చిరంజీవిని గిల్లారు. దీనిపై మెగా అభిమానులు కోపోద్రిక్తులై కొడాలి నానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. గుడివాడలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కొడాలి నాని వైఖరిని తప్పు పడుతూ నిరసనలు చేశారు. దీనిపై కొడాలి నాని అనుచరుడు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మెగా అభిమానులను కొడాలి నానికి దూరం చేసేందుకు కొందరు కుట్ర పన్నారని మాట్లాడారు. చిరంజీవిని గిల్లిన కొడాలి నానిని మెగా అభిమానులు గిల్లితే దీనికి కుట్రలు.. కుతంత్రాలు అంటూ కొడాలి నాని తన అనుచరులతో ప్రెస్ మీట్ పెట్టించడం దేనికనే రీతిలో ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. చిరంజీవిని నాని గిల్లారు.. ఆయన అభిమానులు తిరిగి గిల్లారు.. అంతే. పేర్ని నాని చెప్పినట్టు అవసరమైతే మరోసారి కొడాలి నాని కానీ.. ఆయన అనుచరులు కానీ చిరంజీవిని గిల్లాలి కానీ.. దీని వెనుక కుట్ర ఉందని గగ్గోలు పెడుతూ ప్రెస్ మీట్లు పెట్టించడం దేనికీ అంటున్నారు. ఈ విషయంలో పేర్ని నాని తన సహచర ఎమ్మెల్యే కొడాలి నానికి ఏమైనా గిల్లుడు సలహా ఇస్తారా..? అని సెటైర్లు వేస్తున్నారట.