టీ-బీజేపీలో మార్పు తప్పదా? కేంద్ర మంత్రిగా బండి?

తెలంగాణ బి‌జే‌పి నాయకత్వంలో మార్పు రానుందా? కొత్త అధ్యక్షుడు రానున్నారా? అంటే తాజాగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే వినిపిస్తుంది. ఇప్పటివరకు అధ్యక్ష పదవి మార్పుపై మీడియాలో కథనాలు వస్తుంటే…వాటిల్లో వాస్తవం లేదు..అధ్యక్షుడుని మార్చే అవకాశం లేదని,బండి సంజయ్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని బి‌జే‌పి పెద్దలు చెప్పుకొచ్చారు.

అయితే అవన్నీ మీడియాని కవర్ చేయడానికి చెప్పిన మాటలు అని అర్ధమైపోతుంది. అధ్యక్ష మార్పు ఖచ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు బండి ఆధ్వర్యంలో బి‌జే‌పి బాగానే పనిచేసింది..కొన్ని విజయాలు అందుకుంది. కాకపోతే కొందరు నేతలతో బండికి సఖ్యత లేకపోవడం, అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన మార్పు ఖాయమని తెలుస్తుంది. ఈ క్రమంలోనే బండిని తప్పించిన…ఆయన్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఒకవేళ మంత్రి పదవి దక్కకపోతే జాతీయ స్థాయిలో బి‌జే‌పి ప్రధాన కార్యదర్శి లాంటి పదవి ఇవ్వవచ్చని సమాచారం…ఇక బండికి మంత్రి పదవి ఇవ్వకపోతే మిగిలిన ఎంపీల్లో ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, కే లక్ష్మణ్ ల్లో ఒకరికి ఛాన్స్ ఇవ్వవచ్చని తెలుస్తుంది.

ఇక అధ్యక్షుడుగా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని నియమిస్తారని సమాచారం. గతంలో కిషన్ రెడ్డి ఉమ్మడి ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడుగా పనిచేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే మంత్రి పదవి అలాగే ఉంచి అధ్యక్ష పదవి ఇస్తారా? లేక మంత్రివర్గం నుంచి తప్పించి అధ్యక్ష పదవి ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. అటు ఈ మధ్య అసంతృప్తిగా ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు సైతం కీలక పదవులు ఇస్తారని తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ బి‌జే‌పిలో మార్పులు ఉండనున్నాయి.