ఆటిజం.. ఇదొక ప్రమాదకరమైన మానసిక రుగ్మత. చిన్నారుల్లో పుట్టుకతోనే వచ్చే ఈ సమస్య ఈ రోజు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ రుగ్మతకు చికిత్స అందించేందుకు తెలంగాణలోని హైదరాబాద్‌లో పలు అటిజం చికిత్స సెంటర్లు వెలిశాయి. అయితే కొందరు అటిజంతో బాధపడే పిల్లలకు చికిత్స అందించే క్రమంలో నకిటీ ఆటలు ఆడుతూ చిన్నారుల భవిష్యత్తును పణంగా పెడుతున్నారు.
వాళ్లకు కావాల్సింది కేవలం డబ్బులే అన్న చందంగా కొన్ని సెంటర్ల నిర్వాహకులు పలు అవతారాలు ఎత్తుతున్నారు. ఇలాంటి సెంటర్లు నిర్వహించాలంటే ప్రభుత్వం నుంచి ఎన్నో అనుమతులతో పాటు ఎన్నో వసతులు, నిపుణులు అయిన ఫ్యాకల్టీ ఉండాలి. కానీ అవేవి లేని కొందరు తూతూ మంత్రంగా సెంటర్లు ఓపెన్ చేసి కాసులు దండుకుంటున్నారు.
అసలు రిజిస్టర్ కూడా చేయకుండానే బయట బోర్డులు పెట్టేసి పిల్లల జీవితాలను సాకుగా చూపి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుని పబ్బం గడుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న థెరపీ కేంద్రాలపై పోలీసులు రెండు రోజులుగా దాడులు చేశారు.
హైదరాబాద్ మహానగరంలోని కూకట్పల్లి, సుచిత్ర, బీకే గూడ, దిల్‌షుక్ నగర్ ప్రాంతాల్లో ప్రభుత్వ గుర్తింపు లేకుండా నిర్వహిస్తున్న `ఆటిజం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్`, `రిహాబిలిటేషన్ సెంటర్ల`పై గత రెండు మూడు రోజులుగా పోలీసులు, వైద్య బృందాల సాయంతో దాడులు చేశారు. కొందరు నిర్వాహకులను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆయా కేంద్రాల్లో పనిచేసే సిబ్బందిని కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
వాస్తవంగా ఈ థెరపీ సెంటర్లు పెట్టాలంటే దివ్యాంగుల హక్కుల( RPWD) చట్టం 2016లోని సెక్షన్ 52 ప్రకారం ఈ థెరపీ కేంద్రాలను రిజిస్ట్రేషన్ చేసుకుని మాత్రమే నిర్వహించాలి. వారికి మానసిక పరిజ్ఞానం, చిన్నారులను అక్కున చేర్చుకునే లక్షణాలు కూడా ప్రధానంగా ఉండాలి. అయితే కొందరు డబ్బు కోసం అడ్డదారులు తొక్కేందుకు అలవాటు పడి అటిజం నయం చేస్తామంటూ ఒక బోర్డు పెట్టుకుని ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకుంటున్నారే విమర్శలు నగరంలో ఉన్నాయి. తాజా దాడుల నేపథ్యంలో తల్లిదండ్రులు స్పందిస్తూ.. నకిలీ కేంద్రాలు..అక్రమ వ్యవహారాలపై చర్చలు తీసుకోవాలని కోరుతున్నారు.