బీసీలపై కాంగ్రెస్ గురి..ఆ సీట్లు ఫిక్స్.!

తెలంగాణలో కూడా కులాల వారీగా రాజకీయం నడుస్తుంది. ఎక్కడకక్క కులాల ఓట్లని ఆకర్షించడమే లక్ష్యంగా బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు ముందుకెళుతున్నాయి. ఇప్పటికే దళితబంధు అని దళితులని, ఇటు బీసీల లక్ష సాయం అంటూ..బి‌సిలని..అటు మైనారిటీలకు సాయం అంటూ వారిని..ఇలా అందరినీ ఆకట్టుకునేలా కే‌సి‌ఆర్ రాజకీయం చేస్తున్నారు. ఇక కే‌సి‌ఆర్ కు ధీటుగా కాంగ్రెస్ కూడా రాజకీయం చేస్తుంది. వారు కూడా బలమైన బీసీలని ఆకట్టుకోవడానికి వారికి ప్రతి పార్లమెంట్ లో రెండు అసెంబ్లీ సీట్లు కేటాయిస్తున్నామని ప్రకటించారు.

మొత్తంగా రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల పరిధిలో 34 మంది బీసీ అభ్యర్థులను బరిలోకి దింపాలని భావిస్తోంది. తాజాగా జరిగిన కాంగ్రెస్ పి‌ఏ‌సి సమావేశంలో రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన తెచ్చారు. దీనికి కాంగ్రెస్ నేతలు ఓకే చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో బి‌సి డిక్లరేషన్ కూడా ప్రకటించనున్న విషయం తెలిసిందే. అందులో ఈ నిర్ణయం ప్రకటించాలని డిసైడ్ అయ్యారు.

అటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 15న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన సభ నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షతన జరగనున్న సభలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కాంగ్రెస్‌ ఏం చేయనున్నది వివరిస్తూ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు. అలాగే ఈ నెల 30న కొల్లాపూర్ లో ప్రియాంక గాంధీ సభ జరగనుంది. ఈ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహ..పలువురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆ సభలోనే ప్రియాంక గాంధీ చేత మహిళా డిక్లరేషన్‌ను ప్రకటించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.

ఇక త్వరలోనే బీసీ గర్జన సభను ఏర్పాటు చేసి, దానికి రాహుల్‌తోపాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్యను కూడా ఆహ్వానించాలని వీహెచ్‌ ప్రతిపాదించారు. మొత్తం మీద కాంగ్రెస్ సైతం కులాల వారీగా ఓట్లని ఆకట్టుకునే పని మొదలుపెట్టింది.