తెలంగాణలో మొన్నటివరకు బిజేపి దూకుడుగా రాజకీయం చేసింది..కానీ కొంతకాలం నుంచి ఆ దూకుడు తగ్గింది. కర్నాటక ఎన్నికల్లో బిజేపి ఓడిపోవడం..ఆ ప్రభావం తెలంగాణపై పడింది. వాస్తవానికి 2019లో 4 పార్లమెంట్ స్థానాలు గెలిచిన దగ్గర నుంచి బిజేపి దూకుడు మీద ఉంది. తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో గెలవడం, జిహెచ్‌ఎంసి లో సత్తా చాటడం..మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడంతో బిజేపి రేసులో ఉంది.
పైగా కేసిఆర్ సైతం బిజేపినే ప్రత్యామ్నాయం అన్నట్లు టార్గెట్ చేసేవారు. దీంతో బిఆర్‌ఎస్, బిజేపిల మధ్యే ఫైట్ జరిగేది. ఇటు కాంగ్రెస్ రేసులో వెనుకబడింది. కానీ కర్నాటక ఎన్నికల నుంచి సీన్ మారింది..అక్కడ కాంగ్రెస్ గెలవడంతో..ఇక్కడ కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. బిజేపిలోకి వలసలు ఆగి..కాంగ్రెస్ లోకి వలసలు మొదలయ్యాయి. అసలు కొంతమంది నేతలని బ్రతిమలాడిన సరే వారు బిజేపిలోకి రాని పరిస్తితి. దీంతో బిజేపి కాస్త వెనుకబడింది.
ఈ సమయంలోనే రాష్ట్రంలో అమిత్ షా పర్యటించనున్నారు. ఈ నెల 15న ఖమ్మంలో పర్యటించనున్నారు. ఇక షా పర్యటన తర్వాత నుంచి రాష్ట్రంలో బిజేపికి కొత్త ఊపు వస్తుందని నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో పార్టీలో కీలక మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. మొన్నటివరకు అధ్యక్షుడు మార్పు ఉండవచ్చని ప్రచారం జరిగింది. కానీ బండి సంజయ్‌నే అధ్యక్షుడుగా కొనసాగిస్తారని తెలుస్తుంది.
అదే సమయంలో పార్టీలో ఈటల రాజేందర్‌కు పెద్ద ప్రాధాన్యత లేదనే పరిస్తితి ఉంది. కేవలం ఆయనకు చేరికల కమిటీ ఛైర్మన్ పదవి మాత్రమే ఉంది. ఈ క్రమంలో ఆయనకు ఎన్నికల ప్రచార సారథి పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు కొంత బ్యాలెన్సింగ్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి బిజేపి ఇకనైనా దూకుడుగా ఉంటుందేమో.