ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో కొనసాగిన పాదయాత్ర ఇప్పుడు సూళ్ళూరుపేటలో జరుగుతుంది. అయితే ఈ జిల్లాలో కూడా లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు గట్టిగానే వస్తుంది. అలాగే ఏ నియోజకవర్గంలోకి వెళితే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేల అరాచకాలు అంటూ లోకేష్ ఫైర్ అవుతున్నారు. అయితే లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఫైర్ అవుతున్నారు.
జిల్లాకు ఎవరేం చేశారో చర్చించుకుందామని సవాల్ చేశారు. అలాగే వైసీపీ నుంచి టిడిపి వైపుకు వెళ్ళిన ఎమ్మెల్యేలపైనా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే అనిల్ పై ఆనం రామ్ నారాయణ రెడ్డి ఫైర్ అయ్యారు. అనిల్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేస్తానని, దమ్ముంటే అనిల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే..తనపై పోటీ చేయడానికి రెడీ అని ఆనం సవాల్ విసిరారు. అటు లోకేష్ సైతం అనిల్ టార్గెట్ గా విరుచుకుపడ్డారు.
యువగళానికి వచ్చిన ప్రజాదరణ చూసి పిల్ల సైకోలు ఏవేవో మొరుగుతున్నాయని, ఆఫ్ నాలెడ్జ్ ఉన్న ఓ వ్యక్తి నీటిపారుదల శాఖ మంత్రి అయ్యాడని, ఆయనకు పని తక్కువ డైలాగులు ఎక్కువని, జిల్లాలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తిచేయని సిల్లీ బచ్చా తనకు సవాల్ ఇస్తాడని అనిల్ టార్గెట్ గా లోకేష్ ఫైర్ అయ్యారు. మీరు ఎంత అభివృద్ధి చేశారో, తాము ఎంత చేశామో మాట్లాడుకుందామని, నాయుడుపేటలోనే ఉన్నానని..దమ్ముంటే రావాలని అనిల్ కు సవాల్ విసిరారు. అలాగే అవినీతి డబ్బు, బినామీల పేరుతో వంద కోట్ల రూపాయల అక్రమ లేఅవుట్ గురించి కూడా మాట్లాడుదామని, దమ్ముంటే నెల్లూరు టికెట్ అనిల్ కు ఇస్తారని చెప్పాలని అన్నారు.
అయితే అనిల్ పై ఇలా టిడిపి నేతలు ఫైర్ అవుతున్న..ఆయనకు మద్ధతుగా నిలబడే వైసీపీ నేతలే కనబడటం లేదు. పైగా సొంత పార్టీ వాళ్ళే అనిల్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో అనిల్‌కు రాజకీయంగా ఇబ్బందులు వచ్చాయి.