బీఆర్ఎస్‌లో భారీ కుదుపు..కాంగ్రెస్‌లోకి నలుగురు బడా నేతలు.!

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరికి వారు పై చేయి సాధించేలా వ్యూహ ప్రతి వ్యూహాలు వేస్తున్నారు. ఇదే క్రమంలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ మళ్ళీ ప్రతిపక్షాలకు చెక్ పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుంది. ఇటు కాంగ్రెస్ ఈ సారైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. అటు బి‌జే‌పి తొలిసారి తెలంగాణలో గెలవాలని చూస్తుంది.

మూడు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే ఇటీవల బి‌జే‌పి కాస్త రేసులో వెనుకబడింది. కర్నాటక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ ఉంది. అలాగే ఆ పార్టీలోకి నేతలు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే క్రమంలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు..కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు.

వీరు మొన్న ఈ మధ్యే బి‌ఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చేశారు. సొంతంగా బలపడేలా ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో బి‌జే‌పి నుంచి ఆఫర్లు వచ్చాయి గాని..వారు మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక బి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి సైతం కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలిసింది. కాకపోతే గద్వాల లో జరిగిన సి‌ఎం కే‌సి‌ఆర్ సభలో ఈయన పాల్గొన్నారు. దీంతో ఈయన రూట్ క్లారిటీ లేదు.

ఇక నిర్మల్ నియోజకవర్గంలో బి‌ఆర్‌ఎస్ లో కీలక నేతగా ఉన్న శ్రీహరి రావు తాజాగా బి‌ఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈయన 2009, 2014 ఎన్నికల్లో నిర్మల్ లో బి‌ఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో ఇంద్రకరణ్ గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఇప్పుడు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో రాజీనామా చేశారు. కాంగ్రెస్ లోకి వచ్చి ఆ పార్టీ నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది. మొత్తానికి కాంగ్రెస్ లో భారీ చేరికలు ఉండనున్నాయి.