మహానాడుపై వైసీపీ ఫోకస్..టీడీపీ భారీ ప్లాన్.!

మరో రెండు రోజుల్లో టీడీపీ శ్రేణులకు పసుపు పండుగ మొదలుకానుంది. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు కార్యక్రమం భారీ స్థాయిలో నిర్వహించడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. రాజమండ్రి వేదికగా మహానాడు జరగనుంది. మహానాడు, ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఒకేసారి జరగనున్నాయి. ఎన్నికల ముందు నిర్వహించిన ఈ మహానాడుని విజయవంతం చేయాలని టి‌డి‌పి శ్రేణులు కష్టపడుతున్నాయి. మహానాడు వేదిక నుంచే ఎన్నికల శంఖారావం పూరించాలని చంద్రబాబు చూస్తున్నారు.

అలాగే ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి పలు కీలక హామీలు కూడా ప్రస్తావించనున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈ మహానాడు జరగనుంది. అందుకే ఈ సారి మహానాడుని భారీ స్థాయిలో విజయవంతం చేసేందుకు టి‌డి‌పి శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. అదే సమయంలో టి‌డి‌పి మహానాడుపై వైసీపీ కూడా ఫోకస్ చేసినట్లు సమాచారం. ఈ మహానాడు గాని భారీ స్థాయిలో సక్సెస్ అయితే వైసీపీకే ఇబ్బంది అవుతుంది. ప్రజా తీర్పులో మార్పు కనిపిస్తున్న ఈ సమయంలో మహానాడు విజయవంతం అయితే వైసీపీకి రిస్క్.

అందుకే వైసీపీ తమ అధికార బలాన్ని ఉపయోగించి మహానాడుని ఫెయిల్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గం నుంచి 10 నుంచి 15 వేల మందిని మహానాడుకు తీసుకెళ్లాలని టి‌డి‌పి నేతలు ప్లాన్ చేస్తున్నారు. అలా తీసుకెళ్లాలంటే..బస్సులు, కారులు కావాలి. అయితే ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్లకుండా ప్రభుత్వం బ్రేకులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

మహానాడుకు భారీ స్థాయిలో జనం వెళ్లకుండా వైసీపీ గట్టిగానే ప్లాన్ చేసిందని తెలుస్తుంది. ఇక వైసీపీ ఎత్తులకు చెక్ పెట్టి ఎలాగైనా మహానాడుకు ప్రజలని తరలించాలని టి‌డి‌పి నేతలు చూస్తున్నారు. మరి చూడాలి మహానాడు ఏ స్థాయిలో విజయవంతమవుతుందో.

Share post:

Latest