విశాఖ వైసీపీలో లొల్లి..సీట్ల తగాదా.!

అధికార వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ పోరు నడుస్తుంది. ముఖ్యంగా సీట్ల విషయంలో పంచాయితీ పెద్దగానే ఉంది. ఇదే క్రమంలో విశాఖలో సైతం నేతల మధ్య సీట్ల పంచాయితీ నడుస్తుంది. విశాఖ నగరంలో ప్రతి సీటులోనూ ఆధిపత్య పోరు. విశాఖ తూర్పు స్థానంలో పలువురు నేతలు సీటు కోసం పోటీ పడుతున్నారు. ప్రధానంగా వంశీకృష్ణ, అక్రమాని విజయనిర్మల మధ్య పంచాయితీ ఉంది.

ఇటు టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌కు కొందరు వైసీపీ నేతలు సహకరించడం లేదు. తాజాగా విశాఖ పశ్చిమలో రచ్చ మొదలైంది. ఇక్కడ మళ్ల విజయ్ ప్రసాద్, ఆడారి ఆనంద్ కుమార్‌ల మధ్య పంచాయితీ ఉంది. గత ఎన్నికల్లో మళ్ల వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక కొన్ని రోజులు ఆయనే ఇంచార్జ్ గా కొనసాగారు. కానీ ఆ మద్య వ్యాపారాలకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో కేసుల నమోదు, అరెస్టు నేపథ్యంలో సమన్వయకర్త బాధ్యతల నుంచి మళ్ల విజయప్రసాద్‌ను తప్పించారు.

ఇక ఇంచార్జ్ గా జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ను నియమించాలని వైసీపీ అధిష్ఠానం భావించింది. కానీ అందుకు మళ్ల వర్గం ఒప్పుకోలేదు. అయితే మళ్ల తన ఫ్యామిలీ నుంచి ఎవరికైనా పదవి ఇవ్వాలని కోరారు. వైసీపీ అధిష్టానం అందుకు ఒప్పుకోలేదు..ఈ క్రమంలోనే టీడీపీ నుంచి వచ్చిన విశాఖ డెయిరీ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌కుమార్‌ను సమన్వయకర్తగా నియమించింది.

మొదట్లో ఆనంద్, మళ్ల కలిసి బాగానే పనిచేశారు. కానీ నిదానంగా వారి మధ్య రచ్చ మొదలైంది. నియోజకవర్గంలో కొంతమంది కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు…ఆడారి ఆనంద్‌కు సహకరించడం లేదనే ప్రచారం పార్టీలో ఉంది. వారు మళ్ల వర్గమ్గా ఉన్నారు. దీంతో ఆడారి..అధిష్టానానికి ఫిర్యాదు చేయగా, 60వ వార్డు కార్పొరేటర్‌ పీవీ సురేష్‌, 89వ వార్డు పార్టీ అధ్యక్షుడు దొడ్డి కిరణ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ఇక వారిని మళ్ళీ పార్టీలోకి తీసుకోచ్చేందుకు మళ్ల పోరాడుతున్నారు.  ఇలా రెండు వర్గాల మధ్య రచ్చ నడుస్తుంది. రచ్చ వల్ల విశాఖ పశ్చిమలో వైసీపీకి మళ్ళీ డ్యామేజ్ అయ్యేలా ఉంది.

Share post:

Latest