`బిచ్చగాడు` మూవీతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ.. ఇప్పుడు `బిచ్చగాడు 2`తో ప్రక్షకులను పలకరించేందుకు సిద్ధం అయ్యాడు. ఈ సినిమాకు ప్రియ కృష్ణస్వామి దర్శకత్వం వహించాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.
దీంతో హీరో విజయ్ ఆంటోనీనే మెగాఫోన్ పట్టి దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పోరేషన్ బ్యానర్‌పై అతడే నిర్మాతగానూ వ్యవహరించాడు. డబ్బు మరియు సైన్స్ చుట్టూ ఈ మూవీ కథ నడుస్తుంది. మే 19న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. మరోవైపు విజయ్ ఆంటోనీ రెండు భాషల్లోనూ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాకు మరింత హైప్ పెంచుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ తెలుగు మీడియాలో విజయ్ ఆంటోనీ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను పంచుకున్నారు. అలాగే టాలీవుడ్ లో తన ఫెవరెట్ హీరో ఎవరు అన్నది కూడా రివీల్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే విజయ్ ఆంటోనీకి పిచ్చి అభిమానమట. `నేను టాలీవుడ్ లో అందరి హీరోల సినిమాలు చూస్తాను, కానీ నాకు వ్యక్తిగతంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం. ఆయన తర్వాతే నాకు ఎవరైనా` అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు. ఈయన కామెంట్స్ కు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.