కడప జిల్లా అంటే పెద్దగా టిడిపికి పట్టు లేని జిల్లా అని చెప్పవచ్చు. జిల్లాలో టిడిపికి కంచుకోట లాంటి నియోజకవర్గాలు పెద్దగా లేవు. గత నాలుగు ఎన్నికల నుంచి జిల్లాలో టిడిపికి మంచి విజయాలు అందడం లేదు. కానీ అంతకముందు మాత్రం టిడిపి మంచి విజయాలు అందుకుంది. అలాగే టిడిపికి కంచుకోట లాంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అలా టిడిపికి కంచుకోటలాగా ఉండే స్థానాల్లో జమ్మలమడుగు కూడా ఒకటి.
టీడీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సత్తా చాటుతుంది. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా అయిదుసార్లు టిడిపి ఇక్కడ గెలిచింది. పొన్నపురెడ్డి ఫ్యామిలీ టిడిపికి అండగా నిలిచింది. ఇక 2004 నుంచి వైఎస్సార్ హవా మొదలైంది. దీంతో టిడిపికి ఓటమి కూడా మొదలైంది. 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. ఇక 2014 నుంచి వైసీపీ హవా మొదలైంది. 2014లో వైసీపీ నుంచి ఆదినారాయణ గెలిచారు. తర్వాత ఆదినారాయణ టిడిపిలోకి వచ్చారు. దీంతో 2019లో వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి బరిలో దిగారు. అటు టిడిపి నుంచి సుబ్బారెడ్డి పోటీ చేశారు.
కానీ జగన్ వేవ్ లో సుధీర్ గెలిచారు. ఇక వరుసగా నాలుగోసారి సుబ్బారెడ్డి ఓడిపోయారు. ఓడిపోయాక ఆయన వైసీపీలోకి వెళ్లారు. అటు ఆదినారాయణ బిజేపిలోకి వెళ్లారు. ఈ క్రమంలో టిడిపికి అండగా ఆదినారాయణ సోదరుడు నిలిచారు. ఇప్పుడు ఆదినారాయణ సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డి టిడిపి ఇంచార్జ్ గా ఉన్నారు. అక్కడ దూకుడుగా పనిచేస్తున్నారు. తాజాగా నారా లోకేశ్ పాదయాత్ర కూడా జరిగింది. దీంతో జమ్మలమడుగులో టిడిపికి కాస్త ఊపు పెరిగింది. ఇక టిడిపిలోకి ఆదినారాయణ మళ్ళీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కానీ ఇక్కడ వైసీపీ స్ట్రాంగ్ గా ఉంది. వైసీపీకి చెక్ పెట్టడం అంత ఈజీ కాదని చెప్పవచ్చు.