రష్మిక, పూజలను కాదని హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా శ్రీలీల.. తారల మధ్య ప్రొఫెషనల్ వార్

టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా అగ్రహీరోయిన్లుగా నిలదొక్కుకున్న రష్మిక, పూజా హెగ్డేలను కాదని శ్రీ లీల ముందుకు దూసుకుపోతోంది. తెలుగు చిత్ర సీమలో హీరోలందరికీ శ్రీలీల ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఓ పక్క సీనియర్ హీరోలు, మరో పక్క యంగ్ హీరోల సరసన ఆమె అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ఆమె ఖాతాలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. భవిష్యత్ ప్రాజెక్టుల్లో సైతం ఆమెనే హీరోలు సిఫార్సు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకప్పడు టాలీవుడ్‌లో పూజా హెగ్డే, రష్మికలదే హవా కొనసాగింది. అయితే శ్రీలీల వచ్చిన తర్వాత వారి అవకాశాలకు గండి పడింది. ఈ తరుణంలో కొందరు నెటిజన్లు పూజ, రష్మికలకు శత్రువు శ్రీలీల అని ప్రచారం చేస్తున్నారు. అయితే అది ప్రొఫెషనల్ వార్ అని, ఆ ఇద్దరు హీరోయిన్లకు తమ అభిమాన తార తక్కువేమీ కాదని శ్రీలీల ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.

చాలా మంది సినీ నటీనటులు పలు ఇంటర్వ్యూలలో డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. శ్రీలీల అలా కాదు. ఎంబీబీఎస్ పూర్తి చేసి మరీ సినీనాట ఆమె రాణిస్తోంది. కన్నడ నాట పుట్టి పెరిగిన ఈ అమ్మాయి అక్కడే హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. తర్వాత తెలుగులో రోషన్ సరసన పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక అక్కడి నుంచి ఆమె కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంది. హిట్‌లు, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తన కళ్లు చెదిరే అందం, ప్రేక్షకులను సమ్మోహితులను చేసే అభినయంతో సినీ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది.


దీంతో బాలీవుడ్ అవకాశాల కోసం టాలీవుడ్‌లో సినిమాలను తగ్గించేసిన పూజ, రష్మికలకు శ్రీలీల షాక్‌లు ఇస్తోంది. టాలీవుడ్ అగ్ర హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలలో శ్రీలీల నటిస్తోంది. బాలకృష్ణ-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలోనూ కనిపించనుంది. ఇవే కాకుండా నితిన్, రామ్ పోతినేని, విజయ్ దేవరకొండ, పంజా వైష్ణవ్ తేజ్, నవీన్ పోలిశెట్టిలకు జోడీగా సినిమాలు చేయనుంది.