సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోల తో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. కానీ హీరోయిన్లకు కనీసం రూ. 10 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఆలోచిస్తారు. అసలు సౌత్ లో పది కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు ఒక్కరూ లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ విషయంపై కొందరు అగ్రతారలు బహిరంగంగానే నిర్మాతలపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు ఈ లిస్టులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ ఇదే విషయంపై మాట్లాడుతూ నిప్పులు చెరిగింది. ఒక సినిమా కోసం నటీనటులిద్దరూ ఒకేలా కష్టపడతారు. అయినా రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు చాలా వైవిద్యం చూపిస్తారు. ఇదెక్కడి న్యాయం అంటూ రకుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
`నిజానికి ప్రేక్షకులను థియేటర్స్ రప్పించగల సత్తా హీరోయిన్లకు కూడా ఉంది. ఈ విషయాన్ని చిత్ర పరిశ్రమలో వారు గుర్తించాలి. సినిమాలో హీరో, హీరోయిన్లకు పారితోషకం ఒకేలా ఇవ్వాలి. మహిళలైతే ఒకలా.. పురుషులకైతే మరోలా ఇవ్వడం కరెక్ట్ కాదు.` అని రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.