రేసులోకి రాహుల్..మోదీకి రిస్క్ పెరుగుతుందా?  

కేంద్ర రాజకీయాల్లో సీన్ మారుతుంది..ఇప్పటివరకు తిరుగులేని ఆధిపత్యంతో కొనసాగుతున్న బీజేపీకి..ధీటుగా కాంగ్రెస్ ఎదుగుతుంది. గత రెండు ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న కాంగ్రెస్..ఈ సారి ఎన్నికల్లో బి‌జే‌పికి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. అయితే ఇంకా విపక్షాల మద్ధతు తోడైతే బి‌జే‌పికి చెక్ పెట్టడం పెద్ద కష్టం కాదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం వస్తున్న సర్వేల్లో బి‌జేపికి ఆధిక్యం ఉన్నా..నిదానంగా అది తగ్గేలా ఉంది.

తాజాగా ఎన్డీటీవీ–లోక్‌నీతి–సెంటర్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ డెవలపింగ్‌ సొసైటీస్‌(సీఎస్‌డీఎస్‌) సంయుక్తంగా ‘ప్రజాభిప్రాయం’ పేరుతో నిర్వహించిన సర్వేలో బి‌జే‌పికి ఆధిక్యం వచ్చిన..కాంగ్రెస్ కూడా పుంజుకుంటుందని తేలింది. గతంతో పోలిస్తే బి‌జే‌పి బలం కాస్త తగ్గగా, కాంగ్రెస్ బలం అనూహ్యంగా పెరిగింది.       19 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో.. 7,202 మందితో ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో పాల్గొన్న 43 శాతం మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకి మద్ధతు ఇచ్చారు.

ఇక 38 శాతం మంది మాత్రం బీజేపీని తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. అయితే 2019లో నిర్వహించిన సర్వేలో వచ్చిన 44 శాతం నుంచి బీజేపీ ఒక శాతం కోల్పోయింది. అదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ 2019లో 19 శాతం రాగా,  తాజా సర్వేలో 10 శాతం ఓటు బ్యాంకు పెంచుకుని 29శాతానికి చేరుకుంది.

అలాగే ప్రధాని మంత్రి విషయంలో 43 శాతం మంది మోదీకే మద్ధతు ఇచ్చారు. రాహుల్‌గాంధీకి 27 శాతం మద్ధతు దొరికింది. మూడో స్థానంలో 4శాతంతో బెంగాల్‌, ఢిల్లీ సీఎంలు మమత, కేజ్రీవాల్‌ ఉండగా.. అఖిలేశ్‌యాదవ్‌కు 3 శాతం, నితిశ్‌కుమార్‌కు 1 శాతం మంది  మద్ధతు ఇచ్చారు. మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధాని రేసులోకి వస్తున్నారు. మరి ఎన్నికల నాటికి పరిస్తితి ఎలా మారుతుందో చూడాలి.