ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. బిఆర్‌ఎస్ నుంచి బయటకొచ్చిన ఆయన..ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్ గా రాజకీయం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఆయన ఏదోక పార్టీలో చేరతారని అంతా అనుకున్నారు. జూపల్లి కృష్ణారావు, పొంగులేటి కలిసి బిజేపిలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని ప్రచారం జరిగింది. ఇటీవల బిజేపి నేతలు సైతం..ఈ ఇద్దరితో భేటీ అయ్యారు. బిజేపిలోకి ఆహ్వానించారు.
అటు కాంగ్రెస్ నేతలు సైతం ఈ ఇద్దరిని తమ పార్టీలోకి ఆహ్వానించారు. కానీ వీరు మాత్రం ఏ పార్టీలో చేరతారనేది క్లారిటీ ఇవ్వలేదు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాతే వీరి నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. అయితే దాదాపు వీరు కొత్త పార్టీ పెట్టడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆ దిశగా పొంగులేటి పావులు కదుపుతున్నారని వార్తా కథనాలు వస్తున్నాయి. ఆ కథనాల ప్రకారం.. తెలంగాణ రైతు సమాఖ్య (టీఆర్‌ఎస్) పేరుతో ఎన్నికల కమిషన్ వద్ద ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్ అయిందని తెలిసింది. ఆ పార్టీని పొంగులేటి అనుచరులే రిజిస్టర్ చేయించినట్లు సమాచారం.
అదే పార్టీ తరఫున రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సుమారు 45 నియోజకవర్గాల్లో తన అనుచరులను బరిలోకి దించే ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 45 స్థానాల్లో పోటీ చేసి 15 స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహాలు రెడీ చేస్తున్నారని తెలిసింది. పొంగులేటి పార్టీలో మొదటి నుంచి బీఆర్‌ఎస్‌లో ఉంటూ భంగపడి.. ఆ పార్టీపై, సీఎం కేసీఆర్‌పై ఆగ్రహంతో ఉన్న నేతలను తీసుకునే ఛాన్స్ ఉంది.
అంటే బిఆర్‌ఎస్ రెబల్ నేతల అంతా కలవనున్నారు. ఇక వారు ఎన్నికల బరిలో దిగితే ఓట్లు చీలిపోయి బిఆర్ఎస్ పార్టీకే నష్టం జరగనుంది. అదే పొంగులేటి ప్లాన్ అని తెలుస్తోంది. చూడాలి మరి పొంగులేటి రాజకీయం ఎలా ఉంటుందో.