రియాలిటీలో పవన్..జనసైనికులు ఒప్పుకుంటారా?

రాజకీయాలు ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా చేయాలి..అప్పుడే ప్రజల నమ్మకాన్ని ఏ నాయకుడైన సంపాదించుకుంటారు. అలా కాకుండా మాటలు కోటలు దాటి..చేతలు గడప కూడా దాటాకపోతే ప్రజలు నమ్మరు. ఇక తమకున్న బలం బట్టే రాజకీయం చేస్తే బాగానే ఉంటుంది..అలా కాకుండా బలాన్ని ఎక్కువ ఊహించని రంగంలోకి దిగితే దెబ్బతినక తప్పదు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్..రియాలిటీకి దగ్గరగానే రాజకీయం చేస్తున్నారని చెప్పవచ్చు.

ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు కాస్త రియాలిటీకి దూరంగా ఉండటం..పైగా వైసీపీ శ్రేణులు..జనసేన శ్రేణులని రెచ్చగొట్టడం..టి‌డి‌పితో పొత్తు ఉంటే పవన్‌కు సి‌ఎం సీటు ఇవ్వాలని డిమాండ్ చేయడం కొన్ని రోజుల నుంచి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కానీ పవన్ ఎప్పుడు కూడా ఈ డిమాండ్ చేయలేదు..ఎప్పటికప్పుడు వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను, గౌరవప్రదమైన పొత్తులే పెట్టుకుంటామని చెబుతూ వస్తున్నారు.  కానీ ఈ పొత్తుని చెడగొడితేనే..ఓట్లు చీలి తమకు లాభం జరుగుతుందని భావిస్తున్న వైసీపీ మాత్రం..జనసేన శ్రేణుల ముసుగులో టి‌డి‌పితో పొత్తు ఉండాలంటే ఖచ్చితంగా పవన్‌కు సి‌ఎం పదవి ఇవ్వాలని డిమాండ్ పెడుతున్నారు.  దీన్నే జనసేన శ్రేణులు కూడా పాటిస్తున్నారు.

అయితే గత ఎన్నికల్లో టి‌డి‌పికి 40 శాతం ఓట్లు, జనసేన 7 శాతం ఓట్లు వచ్చాయి. దీని బట్టి చూసుకుంటే పవన్‌కు సి‌ఎం సీటు టి‌డి‌పి ఇవ్వడం అనేది అసాధ్యం..పైగా చంద్రబాబు ఉండగా సి‌ఎం సీటు ఇవ్వడం జరిగే పని కాదు. అదే విషయం పవన్ అర్ధం చేసుకున్నారు. తనని సీఎం చేయాలని టీడీపీ, బీజేపీ వాళ్లు ఎందుకంటారు? వాళ్ల నోటి నుంచి ఒక్క మాట కూడా రాదని, వారి స్థానంలో తానున్నా అననని, మన బలం చూపించి, సత్తా చాటి పదవులు తీసుకోవాలని, కండిషన్లు పెడితే జరిగేది కాదని, తన కండిషన్ అంతా వైసీపీని గద్దె దించడమే అని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో 137 స్థానాల్లో జనసేన పోటీ చేసిందని, అప్పుడు 30-40 సీట్లలో గెలిపించి ఉంటే సి‌ఎం సీటు ఇప్పుడు అడిగే హక్కు ఉంటుందని అన్నారు. అంటే సి‌ఎం సీటు అడగనని పవన్ పరోక్షంగా చెప్పేస్తున్నారు. మరి దీన్ని జనసైనికులు ఎలా చూస్తారో చూడాలి.

Share post:

Latest