అరెస్ట్ అయిన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. అభిమానం హ‌ద్దులు దాటితే ఇలానే ఉంటుంది మ‌రి!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ అయ్యారు. అభిమానం హ‌ద్దులు దాట‌డ‌మే ఇందుకు కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మే 20న ఎన్టీఆర్ 40వ పుట్టిన‌రోజు జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కెరీర్ లో మైల్‌స్టోన్ గా నిలిచిన `సింహాద్రి` చిత్రాన్ని భారీ ఎత్తున‌ రీ రిలీజ్ చేశారు.

రాజ‌మౌళి రూపొందించిన ఈ సినిమా దాదాపు ఇర‌వై ఏళ్ల త‌ర్వాత థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌గా.. అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఫ్యాన్స్ అభిమానం పేరుతో అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించారు. ప‌లు చోట్ల‌ థియేట‌ర్స్‌లోనే ట‌పాసులు కాల్చి భారీ న‌ష్టాన్ని క‌ల‌గ‌జేశారు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని చెమ్మనగిరిపేటలోని సిరి వెంకట్, సిరి కృష్ణ థియేటర్‌ వద్ద కొంద‌రు ఫ్యాన్స్‌ రెండు మేకలను వధించి, వాటి రక్తాన్ని అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ బ్యానర్‌లపై చిందించారు.

ఈ ఘటనకు సంబంధింన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో రంగంలోకి దిగిన రాబర్ట్‌సన్‌ పోలీసులు గుడ్లవల్లేరుకు చెందిన శివనాగరాజు పోతుమూడితో పాటు అతని స్నేహితులు సాయి కుంభం, సాయి గంజల, నాగ భూషణం దావు, సాయి వక్కలగడ్డ, నాగేశ్వరరావు పల్లపు, ధరణి యేలికట్ల, శివ పరసా, అనిల్ కుమార్ బొల్లాలపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు.