కడప కోటలోకి లోకేష్..టీడీపీకి ఛాన్స్ ఉంటుందా?

యువగళం పాదయాత్రతో నారా లోకేష్ దూసుకెళుతున్న విషయం తెలిసిందే. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూ..వారి సమస్యలు తెలుసుకుంటూ, అండగా నిలబడుతున్నారు. ప్రజలతో మమేకమవుతుండటంతో లోకేష్‌కు ప్రజల నుంచి మద్ధతు కూడా వస్తుంది. మొదట్లో లోకేష్ పాదయాత్రకు పెద్దగా ప్రజాధరణ రాలేదు..కానీ నిదానంగా ఆదరణ పెరుగుతూ వచ్చింది. లోకేష్ ప్రజలతో మమేకమవుతున్న తీరు ఆకట్టుకుంటుంది.

అలాగే తనదైన శైలిలో జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఏ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే..అక్కడ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసుకుని లోకేష్ విమర్శలు చేస్తున్నారు. ఈ అంశాలు ఎక్కువ హైలైట్ అవుతున్నాయి. అదే సమయంలో టీడీపీకి కాస్త బలం పెరుగుతుంది. ఇప్పటివరకు లోకేష్ ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర చేశారు. మూడు జిల్లాల్లో పాదయాత్ర విజయవంతంగా కొనసాగింది. తాజాగా కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డలో పాదయాత్ర ముగించుకుని..ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలోకి లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టారు.

ఇక కడప అంటే జగన్ సొంత అడ్డా. ఇక్కడ వైసీపీ హవా ఎక్కువ. గత ఎన్నికల్లో జిల్లాలో 10కి 10 సీట్లు వైసీపీనే గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే అలాంటి చోట లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. మరి పాదయాత్ర వల్ల కడపలో టి‌డి‌పికి ఏమైనా ప్లస్ అవుతుందా? అంటే కొంతమేర ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చెప్పవచ్చు. ఇప్పటికే అక్కడ వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుంది. కొన్ని స్థానాల్లో టి‌డి‌పి బలపడుతుంది.

ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, కమలాపురం లాంటి స్థానాల్లో టి‌డి‌పికి బలం పెరుగుతుంది. ఈ తరుణంలో లోకేష్ పాదయాత్ర చేయడం వల్ల కడపలో టి‌డి‌పికి కాస్త ప్లస్ అవుతుందనే చెప్పాలి. చూడాలి మరి కడపలో లోకేష్ పాదయాత్ర ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో.