తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బాగుచేసేందుకు అధిష్టానం పెద్దలు కష్టపడుతున్నారు. ఇంతకాలం పెద్దగా పట్టించుకోలేదు ..కానీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో కీలక నేతలు తెలంగాణపై ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా తెలంగాణలో పర్యటించారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నిరుద్యోగుల కోసం నిర్వహించే భారీ సభలో పాల్గొనున్నారు.
ఇక ఈ సభతో తెలంగాణలో కాంగ్రెస్ సత్తా ఏంటో ప్రత్యర్ధులకు చూపించాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక..తెలంగాణ కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టారు. పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నేరుగా రాష్ట్రానికి రానుండటంతో..అక్కడ పరిస్తితులని అవగాహన చేసుకుని, నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అయితే తెలంగాణకు ప్రియాంక వస్తున్న నేపథ్యంలో మంత్రి కేటిఆర్..కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. అలాగే తెలంగాణకు వచ్చే ముందు ఇక్కడి ప్రజలకు ప్రియాంక క్షమాపణ చెప్పాలని కేటిఆర్ డిమాండ్ చేశారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం చేపట్టిన తెలంగాణ ఉద్యమంలో వందలాది యువత బలిదానాలకు కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యమే కారణమని, ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహాలకు ప్రియాంక గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక సోనియాను బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చిన కాంగ్రెస్ నాయకత్వానిది అమాయకత్వమో, ఆత్మహత్యాసదృశమో తేల్చుకోవాలని, గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించి ఆ పార్టీ తన అంతానికి స్వయంగా వీలునామా రాసుకుందని..రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి కేటిఆర్ కామెంట్ చేశారు.
అయితే విమర్శలు ఎలా ఉన్నా..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే టార్గెట్ గా ప్రియాంక దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే సభని భారీ స్థాయిలో నిర్వహించి సక్సెస్ చేసి..ప్రత్యర్ధులకు గట్టి సవాల్ విసరాలని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చూస్తున్నారు. మరి చూడాలి ప్రియాంక సభ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌కు కొత్త ఊపు వస్తుందేమో.