టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు.. కానీ హిట్ మాత్రం పడటం లేదు. ఇటీవల గోపీచంద్ `రామబాణం` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమా మే 5న విడుదలైంది.
కానీ, ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. దీంతో గోపీచంద్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. గోపీచంద్ కు వరుస ఫ్లాపులు పడడానికి కారణం అయిన గడ్డమే అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ కు కొదవే లేదు. ఒక్కొక్కరికీ ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది.
అయితే కొన్ని సెంటిమెంట్స్ మంచి చేస్తే.. మరికొన్ని నష్టాలను తీసుకొస్తాయి. గోపీచంద్ కి మాత్రం నష్టమే తీసుకొచ్చింది. ఆయన గడ్డం తో ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిందట. నిజం, రారాజు, ఒంటరి, గౌతమ్ నందా, పంతం, చాణక్య వంటి చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఇక రామబాణంలోనూ పలు చోట్ల గోపీచంద్ గడ్డంతో కనిపించాడు. ఈ సినిమా సైతం ఫ్లాప్ అయింది. దీంతో గడ్డం వల్లే గోపీచంద్ కు వరుస ఫ్లాపులు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు దీనిని నాన్‌సెన్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు.