సొంత బేనర్లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో.. ‘పుష్ప 2’ తర్వాత షురూ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసినదే. ఈ సినిమా తరువాత ప్రాజెక్ట్ గురించి అభిమానుల మధ్యలో ఎన్నో సందేహాలు ఉండగా దానికి ఓ క్లారిటీ వచ్చేసింది. అవును, ఈ సినిమా తరువాత ముచ్చటగా మూడోసారి మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా షురూ కానుంది. అవును, బన్నీ మరియు గురూజీ కలిసి పాన్ ఇండియా సినిమాకి భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నిర్మించనుందని భోగట్టా.

ఇపుడు ఈ విషయాన్ని ‘2018’ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన ‘బన్నీ’ వాసు చెప్పడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా… పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ కథపై త్రివిక్రమ్ కసరత్తులు చేయనున్నారని సమాచారం.

ఇకపోతే పుష్ప సినిమా తరువాత హిందీ దర్శకులు సైతం అల్లు అర్జున్ కథానాయకుడిగా సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారని వినికిడి. ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’లో హీరోగా నటించమని ఆయన్ను ఆల్రెడీ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆ సినిమా ఓకే చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాను హిందీలో ‘షెహజాదే’ పేరుతో రీమేక్ చేసిన విషయం విదితమే. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే, తెలుగు సినిమా చూసిన కొందరు… హిందీలో ఆ ఫీల్ లేదని కామెంట్స్ చేయడం కొసమెరుపు.

Share post:

Latest