ఏపీ గవర్నర్గా రాజ్యాంగ కోవిదుడు.. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ని యమితులయ్యారు. నిజానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. అయి తే.. జస్టిస్ నజీర్ నియామకంపై రాష్ట్రంలో అనేక రూపాల్లో చర్చ సాగుతోంది. ప్రతిపక్షాలు.. కొత్త గవర్నర్ రాకతో.. వైసీపీ దూకుడుకు అడ్డుకట్ట పడుతుందని చెబుతున్నాయి. అయితే.. వైసీపీ మాత్రం తమ దారి తమదేనని అంటోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో అసలు జస్టిస్ నజీర్ నియామకంపై తాజాగా వైసీపీలో అంతర్మథనం ప్రారం భమైంది. సీఎం జగన్ పార్టీ నాయకులు.. ఎమ్మెల్యేలు, మంత్రులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావే శంలో చేసిన ఒకే ఒక్క వ్యాఖ్య.. ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది. ఇప్పుడున్న పరిస్థితిలో మనం కేంద్రంపైనా ఆధారపడలేం! అని అన్నారు. దీనిపై అనేక రూపాల్లో నాయకులు చర్చించుకుంటున్నారు.
కేంద్రం ఏపీ విషయంలో అనుసరించబోయే వ్యూహాన్ని ముందుగానే సీఎం జగన్ ఊహించారని కొందరు అంటుంటే.. కాదు.. గవర్నర్ విషయంలో సీఎం జగన్ చేసిన అభ్యర్థనను కేంద్రం కొట్టి వేసిందని.. అందు కే సీఎం జగన్ అలా వ్యాఖ్యానించి ఉంటారని మరికొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. నిజానికి గత నెలలో సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లారు. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖను కూడా ఆయన కలిసారు.
అప్పుడు ఏం జరిగిందో తెలియదు కానీ.. ఆ తర్వాత.. కేవలం 20 రోజుల్లోనే గవర్నర్ను బదిలీ చేశారు. అయితే.. ఈ సందర్భంగా.. సీఎం జగన్కు అప్పట్లోనే గవర్నర్ను బదిలీ చేస్తున్నారన్న సంకేతాలు అందాయని.. దీంతో ఆయనే స్వయంగా గవర్నర్ను మార్చొద్దంటూ.. కేంద్రానికివిన్నవించారని.. అయినప్పటికీ.. కేంద్రం జగన్ అభ్యర్థనను పట్టించుకోకుండా బదిలీ చేసిందని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.
ఇక, పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి గవర్నర్గా పదవి ని ఇచ్చి.. అక్కడిఎన్నికల్లో లబ్ధి పొందాలనే వ్యూహం కేంద్రం అనుసరించిందని మరికొందరు చెబుతున్నారు. దీనిలో సీఎం జగన్ను ఇబ్బంది పెట్టే వ్యూహం ఏమీలేదని ఇంకొందరు అంటున్నారు. మొత్తంగా కొత్త గవర్నర్ వ్యవహారం వైసీపీలో అంతర్మథనానికి దారితీసింది.