రేవంత్ పాదయాత్ర..సీనియర్ల మెలికలు..!

ఎట్టకేలకు తెలంగాణలో పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర మొదలుకానుంది..దాదాపు రెండు నెలల పాటు రేవంత్ పాదయాత్ర జరగనుంది. ములుగు నుంచి రేవంత్ పాదయాత్ర మొదలవుతుంది. అయితే ఎప్పటినుంచో పాదయాత్ర చేయాలని రేవంత్ చూస్తున్న విషయం తెలిసిందే. కానీ పార్టీలో ఉన్న విభేదాలు వల్ల పాదయాత్ర కుదరలేదు. పైగా రేవంత్ ఏం చేసిన కొందరు సీనియర్లు అడ్డుపెడుతూ వచ్చారు. అయితే ఇటీవల కొత్తగా వచ్చిన ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే  పార్టీలో పరిస్తితులని చక్కదిద్దుతూ వచ్చారు.

దీంతో పార్టీలో విభేదాలు సద్దుమణిగినట్లే కనిపించాయి. ఇదే క్రమంలో హత్ సే హత్ పాదయాత్ర మొదలుపెట్టడానికి సిద్ధమయ్యారు. రేవంత్ ములుగు నుంచి పాదయాత్ర మొదలుపెట్టనుండగా,  మేడారంలోని గట్టమ్మ, సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత.. మేడారంలో సమ్మక్క, సారలమ్మలకు మొక్కులు చెల్లించుకుని, ప్రజాసంఘాల నేతలతో భేటీ అవుతారు. గద్దెల దగ్గర్నుంచే తన యాత్రను ప్రారంభిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముఖ్యనేతలు సోమవారం ‘హాత్‌ సే హాత్‌ జోడో’ పాదయాత్రలను నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే వెల్లడించారు

అయితే రేవంత్ పాదయాత్రపై సీనియర్ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అబ్జెక్షన్ పెడుతున్నారు. రేవంత్ కేవలం తన క్యాడర్, అనుచర నేతలు ఉన్న రూట్ లోనే రేవంత్ పాదయాత్ర చేస్తున్నారని, దీని వల్ల రేవంత్ తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు అందరూ కలిసి పాదయాత్ర చేసేలా చేయాలని అంటున్నారు.

దీనిపై మాణిక్ రావు సీరియస్ గానే స్పందించారు. నేతలంతా తమకు అనుకూలమైన స్థానాల్లో పాదయాత్ర చేసుకోవచ్చని, అంతా ఒకచోట పాదయాత్ర చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. మరి రేవంత్ పాదయాత్రలో ఎంతమంది సీనియర్లు కలిసొస్తారో చూడాలి.