యనమల దివ్యతో తునిలో టీడీపీకి కలిసొస్తుందా?

తుని..పేరుకు టీడీపీ కంచుకోట గాని..గత మూడు ఎన్నికల్లో వరుసగా ఓడిపోతూ వస్తుంది. 1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు అక్కడ టీడీపీ జెండా ఎగిరింది. టి‌డి‌పి నుంచి యనమల రామకృష్ణుడు వరుసగా గెలిచారు. ఇక 2009 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. 2014లో ఆయన పోటీ చేయలేదు. ఆయన సోదరుడు కృష్ణుడు పోటీ చేశారు. అయితే అప్పటికే యనమల ఫ్యామిలీపై ఉన్న వ్యతిరేకత పోలేదు. దీంతో 2014లో కూడా టీడీపీ ఓడిపోయింది.

2019 ఎన్నికల్లో చెప్పాల్సిన పని లేదు. మరోసారి ఓటమి రుచి చూశారు. అయితే రాష్ట్రంలో టీడీపీ నిదానంగా బలపడుతుంది. కానీ తునిలో మాత్రం పార్టీ పరిస్తితి మెరుగు అవ్వడం లేదు. పైగా అక్కడ మంత్రి దాడిశెట్టి రాజా స్ట్రాంగ్ గా ఉన్నారు. దీంతో తుని సీటుపై టి‌డి‌పి ఆశలు వదులుకోవాల్సిందే అనే పరిస్తితి. పైగా ఈ సారి యనమల ఫ్యామిలీకి సీటు ఇవ్వకూడదనే డిమాండ్ వచ్చింది. కానీ సీనియర్ నేత యనమలని కాదని చంద్రబాబు వేరే వాళ్ళకు సీటు ఇవ్వడం కష్టం.

అందుకే తాజాగా కృష్ణుడుని పక్కన పెట్టినా యనమల కుమార్తె దివ్యకు తుని సీటు ఫిక్స్ చేశారు. తాజాగా ఆమెని ఇంచార్జ్ గా పెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆమె తుని బరిలో దిగనున్నారు. అయితే దివ్యని గెలిపించుకోవాలని యనమల గట్టిగా కష్టపడుతున్నారు. వరుసగా మూడు ఓటములతో యనమల ఫ్యామిలీ ఇమేజ్ దెబ్బతింది.

ఈ సారి కూడా ఓడిపోతే ఇంకా యనమల ఫ్యామిలీ పరిస్తితి దిగజారుతుంది. ఆ పరిస్తితి రానివ్వకుండా చూసుకోవాలని యనమల ప్లాన్ చేస్తున్నారు. ఎలాగైనా తుని సీటుని దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే తన సోదరుడు కృష్ణుడు ఏ మేరకు సహకరిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. అంతా కలిసికట్టుగా ముందుకెళితే తునిలో గట్టెక్కొచ్చు. మరి చూడాలి ఈ సారైనా తుని టీడీపీకి దక్కుతుందో లేదో.