టాలీవుడ్ సీనియర్ హీరోలైనా చిరంజీవి, బాలకృష్ణ వరుస సినిమాలతో బాక్సాఫీస్ పై యుద్ధం ప్రకటించారు. వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తూ వారి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఇద్దరు సీనియర్ హీరోలు తమ సినిమాలతో పోటీపడిన విషయం తెలిసిందే. చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, బాలయ్య వీర సింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇద్దరూ అదిరిపోయే హిట్ అందుకున్నారు.
ఈ సినిమాల తర్వాత కూడా ఈ ఇద్దరు వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ హిట్ మూవీ వేదాళంకు రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది. ఇక బాలయ్య కూడా తన 108 వ సినిమాను స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇప్పటికే మొదలు పెట్టాడు. ఇక ఇప్పుడు ఈ రెండు సినిమాలతో కూడా ఈ ఇద్దరు హీరోలు మరోసారి బాక్సాఫీస్ యుద్ధంలో దిగబోతున్నారు.
చిరు, బాలయ్య ఇసారి దసరా బరిలో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. చిరు సినిమాను ముందుగా సమ్మర్లో రిలీజ్ అనుకున్నారు. అయితే ఇప్పుడు చిరుయే కావాలని దసరా బరిలో తన సినిమాను వేయిస్తున్నారట.
బాలయ్యపై సంక్రాంతికి కలెక్షన్ల పరంగా పై చేయి సాధించడంతో మరోసారి చిరు బాలయ్యతో పోటీకి ఉత్సాహంగా ఉన్నారంటున్నారు. ఏదేమైనా ఈ సీనియర్ హీరోల బాక్స్ ఆఫీస్ పోటీ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్వరలోనే ఈ సినిమాల రిలీజ్ డేట్ ప్రకటించబోతున్నారని కూడా తెలుస్తుంది. ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమాలతో కూడా ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి.