`వీర సింహారెడ్డి` ఓటీటీ పాట్నర్ లాక్‌.. ఇంత‌కీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

`అఖండ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` మూవీతో నేడు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంట‌ర్టైన‌ర్ లో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. దునియా విజ‌య్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం నేడు అట్ట‌హాసంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీకి పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తుతున్నాయి. ఫస్ట్ హాఫ్ సూపర్.. యాక్షన్ సీన్స్ తో బాలయ్య రచ్చ రచ్చ చేశాడంటూ.. సినిమా అదిరిపోయిందంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. రివ్యూలు చూస్తుంటే బాల‌య్య‌కు మ‌రో హిట్ ఖాయంగా క‌నిపిస్తోంది.

ఇక‌పోతే ఈ సినిమా ఓటీటీ పాట్న‌ర్ లాక్ అయింది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్ భారీ మొత్తంలో చెల్లించి వీర సింహారెడ్డి డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ సినిమా ఓపెనింగ్‌ క్రెడిట్స్‌ సమయంలో వెల్లడించారు. అయితే థియేట‌ర్స్ లో విడుద‌లైన ఎనిమిది వారాల త‌ర్వాత ఓటీటీలో ఈ సినిమా సంద‌డి చేయ‌నుంద‌ని అంటున్నారు. అంటే ఫిబ్ర‌వ‌రి ఆఖ‌రి వారంలో లేదా మార్చి మొద‌టి వారంలో ఈ సినిమా ఓటీటీలో సంద‌డి చేసే అవ‌కాశాలు ఉన్నాయి.